
ప్రఖ్యాత గాయని కన్నుమూత
జమ్ము కశ్మీర్ లెజెండరీ సింగర్ రాజ్ బేగం బుధవారం కన్నుమూశారు.
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లెజెండరీ సింగర్ రాజ్ బేగం బుధవారం కన్నుమూశారు. ఆమె వయసు 89 ఏళ్లు. రాజ్ బేగం ఏడు దశాబ్దాలకు పైగా తన పాటలతో లక్షలాది అభిమానులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఆమెను నైటింగేల్ ఆఫ్ కశ్మీర్, ఆశా భోంస్లే ఆఫ్ కశ్మర్గా పిలుస్తారు.
రాజ్ బేగం అనారోగ్యంతో మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కశ్మీర్ లోయలోని ప్రసిద్ధ మహిళా గాయకుల్లో ఆమె ఒకరు. ఆమె వేలాది పాటలు పాడారు. దేశ, విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. 1940లో ఆమె రేడియో కశ్మీర్లో చేరారు. కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి అభ్యంతరాలు వచ్చినా పెళ్లి తర్వాత కూడా ఆమె గాయనిగా కెరీర్ కొనసాగించారు. 2002లో పద్మశ్రీ అవార్డు, 2013లో సంగీత్ నాటక్ అకాడమీ అవార్డులను రాజ్ బేగం అందుకున్నారు.