వెండితెరపై కశ్మీర్‌ కోయిల | Raj Begum Songs of Paradise, streaming on Amazon Prime | Sakshi
Sakshi News home page

వెండితెరపై కశ్మీర్‌ కోయిల

Sep 4 2025 6:06 AM | Updated on Sep 4 2025 6:06 AM

Raj Begum Songs of Paradise, streaming on Amazon Prime

బయోపిక్‌

మనకు ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి తెలుసు. మహనీయ కర్నాటక సంగీత విద్వాంసురాలు. లతా మంగేష్కర్‌ తెలుసు. సినీ సంగీతానికి రారాణి.  కాని  రాజ్‌ బేగం తెలియదు. ఆమె వీరిద్దరి కాలం నుంచే పాడుతోంది. వీరితో సమానంగా కశ్మీర్‌ ప్రజల జేజేలు అందుకుంది. కశ్మీర్‌ కోయిల బిరుదు అందుకుంది. కాని ఆమె దేశానికి తెలియడానికి ఇంత కాలం పట్టింది. అదికూడా ఇప్పుడు ఆమె జీవితం ఆధారంగా తీసిన ‘సాంగ్స్‌ ఆఫ్‌ పారడైజ్‌’ సినిమా అమేజాన్‌లో విడుదల అయ్యాక.

1950ల కాలం ఊహించండి.
కశ్మీర్‌ పర్వత ప్రాంతం. అక్కడివన్నీ గిరిజన సంప్రదయాలు. కశ్మీర్‌కే తనదైన గొప్ప సంగీతం, గానం, వాయిద్యం, కవిత్వం, గీతం... ఉన్నాయి. అక్కడ కశ్మీరీ భాషలో ఎంతో మంచి సాహిత్యం ఉంది. కాని అక్కడ ఉర్దూ, హిందీ కూడా వాడుకలో ఉంది. నిరంతరం ఏదో ఒక అలజడికి లోనయిన ఆ ప్రాంతంలో స్త్రీలు ఏ పనిలో అయినా ముందుకు రావడం కష్టంగా ఉండేది. వారి కళ కూడా నాలుగ్గోడల మధ్యే తప్ప బహిరంగం కావడానికి లేదు.

ఈ నియమాన్ని బ్రేక్‌ చేసిన గాయని రాజ్‌బేగం. 1927లో శ్రీనగర్‌లో జన్మించిన రాజ్‌బేగం బాల్యంలోనే పాటను గ్రహించింది. అది అక్కడ కురిసే మంచులా ఆమెలో సహజంగా ఉద్భవించింది. గిరిజన గీతాలు, జానపద పాటలు పెళ్లిళ్లలో పాడటం మొదలుపెట్టింది. 1950లలో ఆమె మొదటిసారి ఆల్‌ ఇండియా రేడియో కశ్మీర్‌ స్టేషన్‌లో పాడింది. మరో నాలుగేళ్లకు అదే రేడియోలో స్టాఫర్‌ అయ్యింది. ఆ తర్వాత బహిరంగ వేదికల మీద పాడసాగింది. తన జీవిత కాలంలో కనీసం రెండు వేల పాటలు ఆమె పాడింది. అయితే దురదృష్టవశాత్తు ఏ పాట రికార్డింగూ అందుబాటులో లేదు. 

కశ్మీర్‌ సంగీతానికి ఆమె చేసిన సేవకు 2002లో ‘పద్మశ్రీ’ దక్కినా ఆమెకు రావాల్సిన ఖ్యాతి రాలేదు. 2016లో రాజ్‌బేగం మరణించింది. జనం ఆమెను అక్కడ నిత్యం తలుచుకుంటూనే ఉంటారు. దేశానికి ఆమె పేరు చేరలేదు. కశ్మీర్‌లో పుట్టి పెరిగి అమెరికాలో చదువుకొని వచ్చిన అక్కడే స్థిరపడ్డ దర్శకుడు డానిష్‌ రెంజు ఆమె బయోపిక్‌ను తీసే అవకాశం పొందగలిగాడు. రాజ్‌ బేగం జీవితాన్ని, సంగీతాన్ని ‘సాంగ్స్‌ ఆఫ్‌ పారడైజ్‌’గా తీశాడు. అమేజాన్‌లో ఆ సినిమా ఆగస్టు 29 నుంచి స్ట్రీమ్‌ అవుతూ విమర్శకుల ప్రశంసలు పొందుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సంగీత అభిమానుల మెప్పు అందుకుంటోంది. దర్శకుడు ఫర్హాన్‌ అఖ్తర్‌ ఈ సినిమాకు ఒక నిర్మాత కావడం విశేషం.

‘అమ్మా... దేవుడు స్త్రీలను పుట్టించింది కేవలం పెళ్లి కోసం కాదు’ అని తన యవ్వన కాలం నుంచి తిరగబడుతూ తన దారిని నిర్మించుకుంటుంది రాజ్‌ బేగం ‘సాంగ్స్‌ ఆఫ్‌ పారడైజ్‌’ సినిమాలో. పెళ్లిళ్లలో పాడుతూ గుర్తింపు పొందిన రాజ్‌ బేగం రేడియో కశ్మీర్‌లో ఆడిషన్‌ ఇవ్వడానికి వెళితే అక్కడంతా అబ్బాయిలే ఉండి ‘నువ్వొచ్చావ్‌ ఏంటి’ అన్నట్టుగా చూస్తారు. అయినా వారిని ఎదిరించి ఆడిషన్‌ ఇచ్చి ఎంపికవుతుంది రాజ్‌ బేగం. అయితే స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఆమె తన సొంత పేరును చెప్పుకోవడానికి వీలుండదు. 

‘నూర్‌ బేగం’ పేరుతో రేడియోలో పాడుతుంది. ఇది కొన్నాళ్లకు తెలిసి ఆమె ఊరి వాళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఆడపిల్ల ఇలా మగవాళ్లుండే చోటుకు వెళ్లి పాడటం ఏంటని రాళ్లతో కొడతారు. బహిరంగ వేదికల మీదకు రాకుండా చూస్తారు. రాజ్‌ బేగం ఇవన్నీ తట్టుకుని తన పాటను జనం వద్దకు తీసుకువెళుతుంది. ఏ జనమైతే ముందు వ్యతిరేకించారో వారంతా ఆమె అభిమానులుగా మారతారు. ఆమెను తమ ప్రాంతపు సాంస్కృతిక రాయబారిగా చేసుకుంటారు. ఆమె పాటలకు పరవశిస్తారు. 

తన జీవితంలో వేల కొలది పాటలు పాడి రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చింది రాజ్‌ బేగం. ఆమె వేసిన దారిలో ఇవాళ ఎందరో కశ్మీర్‌ గాయనులు పాటలు పాడుతున్నారు. రాజ్‌ ఎదుర్కొన్న వ్యతిరేకత వీరికి లేదు. ‘సాంగ్స్‌ ఆఫ్‌ పారడైజ్‌’లో యంగ్‌ రాజ్‌ బేగంగా సబా ఆజాద్, వృద్ధ రాజ్‌ బేగంగా సోని రాజ్‌దాన్‌ (ఆలియా భట్‌ తల్లి) నటించారు. సినిమా హిందీ భాషలో సాగినా పాటలు కశ్మీర్‌ సువాసనలతో ఉంటాయి. కశ్మీర్‌ జీవితం, సంప్రదాయాలు, మాటా, వరుస... అన్నీ ఈ సినిమాలో కనిపిస్తాయి. ఇన్నాళ్లకు కశ్మీర్‌ సినిమా ఒకటి వచ్చింది. అది ఒక గాయని గురించి కావడం సంతోషపడవలసిన సంగతి. కళ మరణించదని మరోసారి నిరూపితమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement