ఇస్‌ ఇండియన్‌కో నికాలో! | Sakshi
Sakshi News home page

ఇస్‌ ఇండియన్‌కో నికాలో!

Published Tue, Sep 20 2016 3:32 PM

ఇస్‌ ఇండియన్‌కో నికాలో! - Sakshi

న్యూయార్క్‌: పాకిస్థాన్‌ విదేశాంగ కార్యదర్శి న్యూయార్క్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ భారతీయ టీవీచానెల్‌ జర్నలిస్టుకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఎన్డీటీవీ జర్నలిస్టు పట్ల కొంత దురుసుగా ప్రవర్తిస్తూ.. ’ఇస్‌ ఇండియన్‌కో నికాలో’ (ఈ భారతీయుడ్ని వెళ్లగొట్టండి) అంటూ బయటకు పంపించారు.

జమ్మూకశ్మీర్‌లోని యూరిలో తాజా ఉగ్రవాద దాడితో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో న్యూయార్క్‌లోని రూజ్‌వెల్ట్‌ హోటల్‌లో పాక్‌ విదేశాంగ కార్యదర్శి ఐజాజ్‌ అహ్మద్‌ చౌదరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భారతీయ జర్నలిస్టులెవరినీ అనుమతించలేదు. ఈ సమావేశానికి హాజరైన ఎన్డీటీవీ జర్నలిస్టు నమ్రత బ్రార్‌ను బయటకు పంపించారు. అంతేకాకుండా 18మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న యూరి ఉగ్రవాద దాడిపై భారతీయ పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు పాక్‌ నాయకత్వం జవాబు దాటవేసింది.

న్యూయార్క్‌లో ఉన్న పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ భారతీయ విలేకరుల ప్రశ్నలను పూర్తి తోసిపుచ్చుతూ.. వారిని ఏమాత్రం పట్టించుకోనట్టు వ్యవహరించారు. మరోవైపు మాత్రం జమ్ముకశ్మీర్‌ లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌ కెర్రీ, బ్రిటన్‌ ప్రధాని థెరిసా మేలతో సమావేశాల్లో మొసలి కన్నీరు కార్చారు.

Advertisement
 
Advertisement
 
Advertisement