లగ్జరీ కేరాఫ్ హైదరాబాద్ | Luxury expo TILE returns to Hyderabad, to open on Dec 13 | Sakshi
Sakshi News home page

లగ్జరీ కేరాఫ్ హైదరాబాద్

Dec 11 2013 1:49 AM | Updated on Sep 4 2018 5:07 PM

లగ్జరీ కేరాఫ్ హైదరాబాద్ - Sakshi

లగ్జరీ కేరాఫ్ హైదరాబాద్

విలాస వస్తువులంటే ఎవరికైనా క్రేజ్ సహజం. ఈ విషయంలో మన హైదరాబాదీలు ఎప్పుడూ ప్రత్యేకమే.

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విలాస వస్తువులంటే ఎవరికైనా క్రేజ్ సహజం. ఈ విషయంలో మన హైదరాబాదీలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఎంతగా అంటే ప్రదర్శనలో కనిపించిందే తడవుగా కోట్లు ఖర్చు చేసి చేజిక్కించుకునేంతగా. 2012 డిసెంబరులో హైదరాబాద్‌లో జరిగిన లగ్జరీ ఎక్స్‌పోలో పుణేకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఆఫర్ చేసిన రూ.10 కోట్ల విలువైన విల్లాకు భాగ్యనగరవాసి మనసు పారేసుకున్నాడట. బ్రోచర్ చూసిందే తడవుగా చెక్కుపై సంతకం చేశాడట. అంతే కాదండో య్.. ఇంతకన్నా ఖరీదైన విల్లాలు ఎక్కడైనా ఉంటే వెతికి పెట్టండంటూ హైదరాబాద్ కస్టమర్లు బారులు తీరుతుండడం విశేషం. 
 
 ధరెంతైనా సై: గతేడాది జరిగిన ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పోలో రూ. 3 కోట్ల విలువున్న బెంట్లే కార్లు రెండు అమ్ముడయ్యాయి. రూ.6 లక్షల ఖరీదైన పొలారిస్ బైక్‌ను దర్జాగా నడుపుకుంటూ వెళ్లారట. రూ.1 లక్ష ఖరీదున్న పాదరక్షలనూ కస్టమర్లు చేజిక్కిం చుకున్నారు. ఎక్స్‌పోలో సుమారు రూ.50 కోట్లకుపైగా విలువైన వ్యాపారం జరిగిందంటే ఇక్కడివారి లగ్జరీ ట్రెండ్‌ను ఇట్టే అర్థం చేసుకోవచ్చు. రూ.8 లక్షలపైగా ఖరీదున్న విదేశీ మొక్కలను కొనే కస్టమర్లూ భాగ్యనగరంలో ఉన్నారు. ఒక కస్టమర్ అయితే ఏకంగా రూ.60 లక్షలతో ఇంటిని హరిత వనంగా తీర్చిదిద్దారని యూనిక్ ఏస్తెటిక్స్ సహాయ మార్కెటింగ్ మేనేజర్ మధు తెలిపారు. సరదాకు(కర్టైన్) ఒక మీటరుకు రూ.18 వేలు ఖర్చు చేసేవారు చాలా మందే ఉన్నారని దర్పన్ ఫర్నీషింగ్స్ ప్రతినిధి సులేమాన్ హిరాణి తెలిపారు. అత్యంత ఖరీదైన వస్తువులను కొనేవారు రాష్ట్రంలో 3-4 లక్షల మంది ఉంటారని అంచనా.   
 
 ప్రదర్శన ఉంటే చాలు..
 మధ్యతరగతి వారి కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ వంటివి రాష్ట్రంలో ఎన్నో జరుగుతుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎగువ మధ్యతరగతి కుటుంబాలు గణనీయంగా పెరిగాయి. వారి కోసమే విలాస వస్తువులతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్టు ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో సీఈవో కరణ్ భంగే సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఏ వస్తువు కొనాలో ఎటువంటి ప్రణాళిక లేకుండా ఎక్స్‌పోకు వచ్చి కొనుక్కునే వారు 40 శాతం మంది ఉంటారని ఆయన చెప్పారు. నలుగురిలో ప్రత్యేకంగా కనపడేందుకు తహతహలాడేవారిలో ఢిల్లీ వాసుల తర్వాతి స్థానం హైదరాబాదీలని, రూ.25 కోట్లైనా సరే విల్లాను కొంటారని అన్నారు. సంపన్నుల్లో 99 శాతం మంది విదేశీ బ్రాండ్లకే మొగ్గు చూపుతున్నారని వివరించారు. ‘చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి. వారి కోసం ఒక రకమైన వాతావరణం సృష్టిస్తే చాలు. లావాదేవీలతో ఎక్స్‌పో కళకళలాడుతుంది’ అని అన్నారు. గతేడాది జరిగిన ఎక్స్‌పోకు 3,200 మంది కస్టమర్లు వచ్చారని చెప్పారు. 
 
 ఈసారి మరింత ఖరీదు..
 ఈ నెల 13 నుంచి 15 వరకు ఇక్కడి విస్పర్ వ్యాలీ వద్ద ఉన్న జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో లగ్జరీ ఎక్స్‌పో జరుగనుంది. దేశ, విదేశాలకు చెందిన 60 బ్రాండ్లు కొలువుదీరనున్నాయి. రూ.8-25 కోట్ల బడ్జెట్‌లో విల్లాలను విక్రయిస్తున్న ఓ రియల్టీ కంపెనీ కూడా స్టాల్ ఏర్పాటు చేస్తోంది. రూ.6 కోట్ల విలువైన ఆస్టన్ మార్టిన్ వాంకిష్ కారు, రూ.కోటి ఖరీదైన ఎక్సీడో లగ్జూరియో వాచీ, ఖరీదైన బ్రాండ్‌గా పేరున్న ఫర్నీచర్ క్లే ప్రదర్శనలో కనువిందు చేయనున్నాయి. త్రీ ఇడియట్స్ సినిమాలో వాడిన ఎరుపు రంగు వోల్వో కారును ఈ సందర్భంగా వేలం వేయనున్నారు. బిడ్డింగ్ ప్రారంభ ధర రూ. 30 లక్షలు. ఇప్పటికే ఓ ఔత్సాహికుడు రూ. 34 లక్షలకు ఒకే అన్నాడట. కాగా, ఎక్స్‌పోకు రావాల్సిందిగా 20 వేల మందికి ఆహ్వానం పంపారు. వీరంతా రూ. కోటికిపైగా వార్షికాదాయం ఉన్నవారే. 5 వేల మంది కస్టమర్లు వస్తారని అంచనా. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement