breaking news
Indian Luxury Expo
-
7.5 కోట్ల కారు... అరకోటి బైక్!!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘ది ఇండియన్ లగ్జరీ ఎక్స్పో-2013’ సంపన్న వర్గాలనే కాకుండా సామాన్యులను సైతం ఆకర్షిస్తోంది. అత్యంత ఖరీదైన కార్లు, బైకులతోపాటు విదేశాలకు చెందిన చాక్లెట్లు, బొమ్మలతోపాటు అలంకరణ సామాగ్రి సైతం ఈ ప్రదర్శనలో ఉంచారు. శుక్రవారం ఇక్కడ రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఇది ఆదివారంవరకు కొనసాగుతుందని సీఈఓ కరణ్ బాంగే తెలిపారు. ప్రదర్శనలో లంబోర్గిని కంపెనీకి చెందిన ‘మర్సిలెగో ఎల్పీ 640’ కారు ప్రతిఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 6400 సీసీతో నడిచే ఈ కారు ఖరీదు రూ. 7.50 కోట్లు. దీనిని క్రికెటర్ యువరాజ్ సింగ్ నుంచి సికింద్రాబాద్‌కు చెందిన సందీప్‌సింగ్ కొనుగోలు చేసి ప్రదర్శన కోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చారు. అలాగే రూ. కోట్ల విలువ చేసే వి8 వింటేజ్ కారు, ల్యాండ్ రోవర్లతో పాటు గ్రామీణ రోడ్లు, పొలాల్లో కూడా ప్రయాణించగలిగే విదేశీ వాహనాలను ఇక్కడ ప్రదర్శిస్తుండడం గమనార్హం. అయితే వీటి విలువ రూ.25 లక్షల వరకు ఉంది. అలాగే బీఎండబ్ల్యు కంపెనీకి చెందిన ఎస్ 1000 మోటర్ బైక్ కూడా సందర్శకులను ఆకట్టుకుంటోంది. దీని విలువ రూ. 45 లక్షలు. ఈ వాహనాన్ని కూడా సికింద్రాబాద్‌కు చెందిన సందీప్ ప్రదర్శనకు తీసుకొచ్చారు. ఇవే కాకుండా బెల్జియం తదితర దేశాలతోపాటు మన దేశీయ వస్తువులు కూడా ఇక్కడ ప్రదర్శనలో ఆకర్షిస్తున్నాయి. 50 బ్రాండెడ్ కంపెనీలకు చెందిన వాహన, వస్తు సామాగ్రిని ప్రదర్శనలో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. 18 లక్షల వాచీ...అయినా కొనలేరు! ఉల్సే నార్డిన్ కంపెనీ తయారు చేసిన లగ్జరీ వాచీ ఇది. దీని ఖరీదు రూ.18 లక్షలు. 34 వాచీలు మాత్రమే కంపెనీ తయారు చేసింది. అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ప్రదర్శనకు మాత్రమే ఉంచారు. -
లగ్జరీ కేరాఫ్ హైదరాబాద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విలాస వస్తువులంటే ఎవరికైనా క్రేజ్ సహజం. ఈ విషయంలో మన హైదరాబాదీలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఎంతగా అంటే ప్రదర్శనలో కనిపించిందే తడవుగా కోట్లు ఖర్చు చేసి చేజిక్కించుకునేంతగా. 2012 డిసెంబరులో హైదరాబాద్‌లో జరిగిన లగ్జరీ ఎక్స్‌పోలో పుణేకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఆఫర్ చేసిన రూ.10 కోట్ల విలువైన విల్లాకు భాగ్యనగరవాసి మనసు పారేసుకున్నాడట. బ్రోచర్ చూసిందే తడవుగా చెక్కుపై సంతకం చేశాడట. అంతే కాదండో య్.. ఇంతకన్నా ఖరీదైన విల్లాలు ఎక్కడైనా ఉంటే వెతికి పెట్టండంటూ హైదరాబాద్ కస్టమర్లు బారులు తీరుతుండడం విశేషం. ధరెంతైనా సై: గతేడాది జరిగిన ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పోలో రూ. 3 కోట్ల విలువున్న బెంట్లే కార్లు రెండు అమ్ముడయ్యాయి. రూ.6 లక్షల ఖరీదైన పొలారిస్ బైక్‌ను దర్జాగా నడుపుకుంటూ వెళ్లారట. రూ.1 లక్ష ఖరీదున్న పాదరక్షలనూ కస్టమర్లు చేజిక్కిం చుకున్నారు. ఎక్స్‌పోలో సుమారు రూ.50 కోట్లకుపైగా విలువైన వ్యాపారం జరిగిందంటే ఇక్కడివారి లగ్జరీ ట్రెండ్‌ను ఇట్టే అర్థం చేసుకోవచ్చు. రూ.8 లక్షలపైగా ఖరీదున్న విదేశీ మొక్కలను కొనే కస్టమర్లూ భాగ్యనగరంలో ఉన్నారు. ఒక కస్టమర్ అయితే ఏకంగా రూ.60 లక్షలతో ఇంటిని హరిత వనంగా తీర్చిదిద్దారని యూనిక్ ఏస్తెటిక్స్ సహాయ మార్కెటింగ్ మేనేజర్ మధు తెలిపారు. సరదాకు(కర్టైన్) ఒక మీటరుకు రూ.18 వేలు ఖర్చు చేసేవారు చాలా మందే ఉన్నారని దర్పన్ ఫర్నీషింగ్స్ ప్రతినిధి సులేమాన్ హిరాణి తెలిపారు. అత్యంత ఖరీదైన వస్తువులను కొనేవారు రాష్ట్రంలో 3-4 లక్షల మంది ఉంటారని అంచనా. ప్రదర్శన ఉంటే చాలు.. మధ్యతరగతి వారి కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ వంటివి రాష్ట్రంలో ఎన్నో జరుగుతుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎగువ మధ్యతరగతి కుటుంబాలు గణనీయంగా పెరిగాయి. వారి కోసమే విలాస వస్తువులతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్టు ఇండియన్ లగ్జరీ ఎక్స్పో సీఈవో కరణ్ భంగే సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఏ వస్తువు కొనాలో ఎటువంటి ప్రణాళిక లేకుండా ఎక్స్‌పోకు వచ్చి కొనుక్కునే వారు 40 శాతం మంది ఉంటారని ఆయన చెప్పారు. నలుగురిలో ప్రత్యేకంగా కనపడేందుకు తహతహలాడేవారిలో ఢిల్లీ వాసుల తర్వాతి స్థానం హైదరాబాదీలని, రూ.25 కోట్లైనా సరే విల్లాను కొంటారని అన్నారు. సంపన్నుల్లో 99 శాతం మంది విదేశీ బ్రాండ్లకే మొగ్గు చూపుతున్నారని వివరించారు. ‘చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి. వారి కోసం ఒక రకమైన వాతావరణం సృష్టిస్తే చాలు. లావాదేవీలతో ఎక్స్పో కళకళలాడుతుంది’ అని అన్నారు. గతేడాది జరిగిన ఎక్స్‌పోకు 3,200 మంది కస్టమర్లు వచ్చారని చెప్పారు. ఈసారి మరింత ఖరీదు.. ఈ నెల 13 నుంచి 15 వరకు ఇక్కడి విస్పర్ వ్యాలీ వద్ద ఉన్న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో లగ్జరీ ఎక్స్పో జరుగనుంది. దేశ, విదేశాలకు చెందిన 60 బ్రాండ్లు కొలువుదీరనున్నాయి. రూ.8-25 కోట్ల బడ్జెట్లో విల్లాలను విక్రయిస్తున్న ఓ రియల్టీ కంపెనీ కూడా స్టాల్ ఏర్పాటు చేస్తోంది. రూ.6 కోట్ల విలువైన ఆస్టన్ మార్టిన్ వాంకిష్ కారు, రూ.కోటి ఖరీదైన ఎక్సీడో లగ్జూరియో వాచీ, ఖరీదైన బ్రాండ్‌గా పేరున్న ఫర్నీచర్ క్లే ప్రదర్శనలో కనువిందు చేయనున్నాయి. త్రీ ఇడియట్స్ సినిమాలో వాడిన ఎరుపు రంగు వోల్వో కారును ఈ సందర్భంగా వేలం వేయనున్నారు. బిడ్డింగ్ ప్రారంభ ధర రూ. 30 లక్షలు. ఇప్పటికే ఓ ఔత్సాహికుడు రూ. 34 లక్షలకు ఒకే అన్నాడట. కాగా, ఎక్స్‌పోకు రావాల్సిందిగా 20 వేల మందికి ఆహ్వానం పంపారు. వీరంతా రూ. కోటికిపైగా వార్షికాదాయం ఉన్నవారే. 5 వేల మంది కస్టమర్లు వస్తారని అంచనా.