సీమాంధ్రులకు న్యాయం జరిగేలా కృషి: హరిబాబు | LK Adavni: will justice to Seemandra people | Sakshi
Sakshi News home page

సీమాంధ్రులకు న్యాయం జరిగేలా కృషి: హరిబాబు

Nov 2 2013 4:55 AM | Updated on Sep 27 2018 5:59 PM

సీమాంధ్రులకు న్యాయం జరిగేలా కృషి: హరిబాబు - Sakshi

సీమాంధ్రులకు న్యాయం జరిగేలా కృషి: హరిబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించి, వారికి న్యాయం జరిగేలా చూస్తామని బీజేపీ అగ్ర నేత అద్వానీ ఆ పార్టీ సీమాంధ్ర నేతలకు హామీ ఇచ్చారు.

అద్వానీ హామీ ఇచ్చారు: కె.హరిబాబు
 అగ్రనేతకు సీమాంధ్ర బీజేపీ నేతల వినతిపత్రం

 
 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించి, వారికి న్యాయం జరిగేలా చూస్తామని బీజేపీ అగ్ర నేత అద్వానీ ఆ పార్టీ సీమాంధ్ర నేతలకు హామీ ఇచ్చారు. సీమాంధ్ర బీజేపీ నేతలు.. కె.హరిబాబు, కె.శాంతారెడ్డి, వై.రఘునాథబాబు, బి.రంగమోహనరావు, రఘు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.విష్ణువర్ధన్‌రెడ్డి శుక్రవారం ఇక్కడ అద్వాన్డ్డ్డ్డ్డ్డ్డ్డీతో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజల భయాలు, సందేహాలు, సమస్యలపై అద్వానీకి వివరించారు.
 
 రాజ్‌నాథ్‌కు ఇచ్చిన వినతిపత్రం ప్రతిని ఆయనకూ అందజేశారు. సీమాంధ్రకు న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు. భేటీ అనంతరం హరిబాబు మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్ర ప్రజలకు న్యాయం జరిగేలా పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని అద్వానీ తమకు హామీ ఇచ్చారని తెలిపారు. 11 అంశాలపై స్పందన కోరుతూ హోంశాఖ పంపిన లేఖ పార్టీకి అందిందని, దీనిపై కసరత్తును రెండ్రోజుల్లో పూర్తిచేసి అభిప్రాయాలను జాతీయ నాయకత్వానికి నివేదిస్తామని, అక్కడి నుంచి తుది స్పందన హోంశాఖకు వెళుతుందన్నారు. అఖిలపక్ష భేటీలో పాల్గొనే విషయాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు.
 సీమకు న్యాయం చేయాలని కోరాం..
 విభజన జరిగితే వెనకబడ్డ రాయలసీమ ఎడారిగా మారిపోయే అవకాశముందని, పోలవరంతో కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం చేసినపుడు రాయలసీమను ఆదుకోవాలని అద్వానీకి విజ్ఞప్తి చేశామని బీజేపీ నేత శాంతారెడ్డి చెప్పారు. గోదావరి నుంచి 200 టీఎంసీల జలాలను రాయలసీమకు తరలించాలని, ఉత్తరాంధ్రకు కూడా నీళ్లు మళ్లించాలని, పోలవరాన్ని నాలుగేళ్లలో  పూర్తిచేసి సీమాంధ్ర ప్రజలను ఆదుకోవాలని కోరినట్లు తెలిపారు.  
 
 వైఎస్సార్‌సీపీపై అద్వానీ ఆరా!
 ఆంధ్రప్రదేశ్‌లోని తాజా రాజకీయ పరిస్థితులు, విభజన ప్రక్రియపై వివిధ పార్టీల వైఖరులు ఎలా ఉన్నాయంటూ అద్వానీ తనను కలిసిన సీమాంధ్ర నేతల నుంచి ఆరా తీసినట్టు తెలిసింది. సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ ఏస్థాయిలో ఉందని ఆయన అడిగినట్లు సమాచారం. మారిన పరిస్థితుల్లో టీడీపీకి ఏపాటి ఆదరణ ఉందని ప్రశ్నించినట్లు సమాచారం. విభజనపై ఇరు ప్రాంతాల నేతలు అందించిన వివరాలను పరిశీలించి రాజ్‌నాథ్‌సింగ్ వాటిపై ఓ నిర్ణయం తీసుకుంటారని అద్వానీ వారికి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement