
అమెరికా ఎన్నికల ఫలితం కీలకం
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం వెలువడిన తర్వాత ప్రపంచ స్టాక్ మార్కెట్ల కదలికలు, డాలర్ పటిష్టత, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం
ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, భెల్ కంపెనీల ఫలితాల ప్రభావం కూడా
స్టాక్ మార్కెట్ గమనంపై విశ్లేషకుల అంచనా
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం వెలువడిన తర్వాత ప్రపంచ స్టాక్ మార్కెట్ల కదలికలు, డాలర్ పటిష్టత, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం వంటి తదితర అంతర్జాతీయ అంశాలు ఈ వారం మన స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. ఈ వారంలో వెలువడే ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి కంపెనీల రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల పోకడలు, డాలర్‌తో రూపారుు మారకం తదితర అంశాలు కూడా స్టాక్ మార్కెట్‌గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు.
అందరి దృష్టి అమెరికా వైపు
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితంపైననే ఈ వారం అందరి దృష్టి ఉంటుందని జైఫిన్ అడ్వైజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దేవేంద్ర నేగి చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తేలేదాకా స్టాక్‌మార్కెట్లు ఒడిదుడుకులకు గురువుతూనే ఉంటాయని, బంగారం వంటి సురక్షిత పెట్టుబడి సాధనాల ధరలు పెరుగుతాయని ఆయన అభిప్రాయ పడ్డారు. గత శుక్రవారం వెలువడిన అమెరికా వ్యవసాయేతర ఉద్యోగ గణాంకాల ప్రభావం కూడా స్టాక్‌మార్కెట్‌పై ఉంటుందని వివరించారు. ఈ నెల 8న(మంగళవారం) అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి.
కీలక కంపెనీల క్యూ2 ఫలితాలు
ఈ వారంలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), భెల్, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, భారత్‌ఫోర్జ్, లుపిన్, బీపీసీఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు తమ తమ క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నారుు. ఈ శుక్ర వారం సెప్టెంబర్ నెలకు సంబంధించిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెలువడనున్నాయి.
గత వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్667 పాయింట్లు నష్టపోయి 27,274 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 204 పాయింట్లు క్షీణించి 8,434 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలు చెరో 2.3 శాతం చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల జోరును కొనసాగిస్తున్నారు. నాలుగు రోజుల్లో రూ.2,000 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల అనిశ్చితే దీనికి కారణమని నిపుణులంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెల 1-4 మధ్యన భారత స్టాక్ మార్కెట్ నుంచి రూ.1,504 కోట్లు, డెట్‌మార్కెట్ నుంచి రూ.496 కోట్లు చొప్పున పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు భారత క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.10,306 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు.
ఒడిదుడుకులు తప్పవు..
వివిధ అంతర్జాతీయ అంశాల కారణంగా ఈ వారం మార్కెట్ ఒడిదుడుకులమయంగా ఉంటుందని ఎస్‌ఎంసీ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ అడ్వైజర్స్ సీఎండీ డి.కె. అగర్వాల్ పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి 8,400 పాయింట్ల వద్ద సమీప మద్దతు ఉందని వివరించారు. గత శుక్రవారం వెలువడిన అమెరికా వ్యవసాయేతర ఉద్యోగ గణాంకాలు బలహీనంగా ఉన్నాయని, డిసెంబర్‌లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పెంచనున్నదన్న అంచనాలపై ఈ గణాంకాల ప్రభావం ఉంటుందని వివరించారు. దిగువ స్థాయిల్లో షార్ట్ కవరింగ్ కారణంగా స్టాక్‌మార్కెట్ ఒడిదుడుకులమయంగా సాగుతుందని ట్రేడ్‌బుల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ధ్రువ్ దేశాయ్ అంచనా వేస్తున్నారు. అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాల కంటే తక్కువగా ఉన్నాయని, దీంతో ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోత అంచనాలు బలహీనపడతాయని జియోజిత్‌బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు.