విచిత్ర శబ్దాల వింత జబ్బు | indiana woman suffers from rare problem that makes her hear internal sounds | Sakshi
Sakshi News home page

విచిత్ర శబ్దాల వింత జబ్బు

Sep 4 2015 5:36 PM | Updated on Sep 3 2017 8:44 AM

విచిత్ర శబ్దాల వింత జబ్బు

విచిత్ర శబ్దాల వింత జబ్బు

మనకు అప్పుడప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం వినిపిస్తుంది లేదా అలా అనిపిస్తుంది. ఆమెకు మాత్రం స్టెతస్కోప్ పెట్టుకొని వింటున్నట్టు లబ్ డబ్ అంటూ గుండె కొట్టుకోవడం చెవులకు నేరుగా వినిపించేది.

మనకు అప్పుడప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం వినిపిస్తుంది లేదా అలా అనిపిస్తుంది. ఆమెకు మాత్రం స్టెతస్కోప్ పెట్టుకొని వింటున్నట్టు లబ్ డబ్ అంటూ గుండె కొట్టుకోవడం చెవులకు నేరుగా వినిపించేది. అంతే కాదు తన అడుగుల శబ్దం తనకు కవాతు చేస్తున్న సైనికుల పదఘట్టనలా ఉండేది. తిన్న తిండి కడుపులోకి వెళ్లాక అక్కడి జీర్ణ వ్యవస్థలో జరిగే క్రియ పెద్ద బాయిలర్ చేసే శబ్దాల్లా వినిపించేవి. కనుగుడ్లు అటూ ఇటూ తిప్పితే నీళ్ల తొట్టిలో చెంబు పెట్టి గిలకొట్టినట్టు ఉండేది. తలలో ఎవరో వస్త్రాలు నేస్తున్నట్టుగా అనిపించేది. ఫలితంగా నిద్ర పట్టేది కాదు. ఇదంతా ఇండియానాకు చెందిన రాచెల్ పైన్ అనే 27 ఏళ్ల యువతి పరిస్థితి. గతేడాది మార్చి నెల నుంచి ఆమెకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది.

ఇండియానాలోని మెరిల్‌విల్లీలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న రాచెల్ స్థానికంగా ఎంతోమంది వైద్యుల వద్దకు వెళ్లింది. ఇదో మానసికమైన జబ్బని వారు మందులు రాసిచ్చారు. అవి ఎంతకాలం వాడినా ఆమె పరిస్థితిలో మార్పు రాలేదు. అమెరికాలో సరైన వైద్యం దొరుకుతుందనే ఉద్దేశంతో ఇక్కడకు వచ్చింది. పలు ఆస్పత్రులకు వెళ్లింది. 9 మంది స్పెషలిస్టులను కలసింది. ఆమె జబ్బేమిటో ఏ డాక్టరూ కనిపెట్టలేక పోయారు. కొంతమంది మానసిక జబ్బని చెబితే, మరికొంత మంది 'మైగ్రేన్' వల్ల అలా అవుతుందని చెప్పారు. మందులిచ్చారు. అయినా ఏమీ మార్పులేదు. ఇక బతుకంతా అంతే.. చేయగలిగింది ఏమీ లేదంటూ కొంతమంది డాక్టర్లు పెదవి విరిచారు.

ఏడు నెలల తర్వాత ఎక్కడైనా వైద్యం ఉండకపోతుందా అన్న విశ్వాసంతో రాచెల్ 'రోనాల్డ్ రీగన్ యూసీఎల్‌ఏ మెడికల్ సెంటర్' లోని హెడ్ అండ్ నెక్ సర్జరీ విభాగం అధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ క్వింటన్ గోపెన్ వద్దకు వెళ్లారు. ఆమె జబ్బుకు అక్కడ సమాధానం దొరికింది. 15 నిమిషాల్లోనే ఆ డాక్టర్ జబ్బేమిటో కనుక్కొన్నారు. చెవి అంతర్భాగానికి, మెదడుకు మధ్య రంధ్రం ఏర్పడడం వల్ల శరీరంలో జరిగే ప్రతి క్రియ, వాటికి సంబంధించిన శబ్దాలు  చెవి ద్వారా మెదడుకు చేరుతాయని ఆయన వివరించారు. ఈ జబ్బును 'సిండ్రోమ్ సుపీరియర్ సెమీసర్క్యులర్ కెనాల్ డెహిసెన్స్ (ఎస్‌ఎస్‌సీడీ)' అని పిలుస్తారని చెప్పారు. ప్రతి ఐదు లక్షల మందిలో ఒక్కరికి ఇలాంటి సమస్య వస్తుందని, తమ ఆస్పత్రి గత ఐదేళ్లలో ఇలాంటి సమస్యతో బాధపడుతున్న దాదాపు 60 మందికి శస్త్ర చికిత్సలు చేసి నయం చేశామని తెలిపారు. డాక్టర్ ఇసాక్ యాంగ్ సహకారంతో డాక్టర్ గోపెన్ రాచెల్ పుర్రెను ఓపెన్ చేసి, మెదడును పక్కకు జరిపి అక్కడ ఏర్పడిన రంధ్రాన్ని 'బోన్ వ్యాక్స్'తో పూడ్చారు.

రాచెల్ ఇప్పుడు అందరిలాగే హాయిగా ఉన్నారు. ఎలాంటి భయంకర శబ్దాలు ఆమెకు వినిపించడం లేదు. తన జబ్బేమిటో గుర్తించి సరైన చికిత్స అందించిన ఇద్దరు డాక్టర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వైద్య చరిత్రలో 1998లో ఎస్‌ఎస్‌సీడీ అనే ఈ సిండ్రోమ్‌ను తొలిసారి కనుగొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement