
ఎన్నికల కంటే ముందే 6,700కు నిఫ్టీ!
తాజాగా వెలువడ్డ నాలుగు ప్రధాన రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు స్టాక్ మార్కెట్లకు బూస్ట్‌నిస్తాయని బ్రోకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ సెక్యూరిటీస్(ఐ-సెక్) పేర్కొంది.
ముంబై: తాజాగా వెలువడ్డ నాలుగు ప్రధాన రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు స్టాక్ మార్కెట్లకు బూస్ట్‌నిస్తాయని బ్రోకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ సెక్యూరిటీస్(ఐ-సెక్) పేర్కొంది. వెరసి వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకంటే ముందుగానే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ) ప్రధాన సూచీ ‘నిఫ్టీ’ 6,700 పాయింట్లను తాకుతుందని అంచనా వేసింది. ఇది చరిత్రాత్మక గరిష్టం కావడం విశేషంకాగా, గడిచిన శుక్రవారం(6న) నిఫ్టీ 6,260 వద్ద ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ లభించిన నేపథ్యంలో వెనువెంటనే నిఫ్టీ 6,300 పాయింట్ల కొత్త రికార్డును నెలకొల్పుతుందని అభిప్రాయపడింది. 2008 జనవరిలో నిఫ్టీ ఇంట్రాడేలో 6,357ను తాకగా, ఈ నవంబర్ 3న 6,317 వద్ద ముగిసి కొత్త రికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే.
నిరోధం కూడా అక్కడే: స్వల్ప కాలంలో సాంకేతికంగా నిఫ్టీకి 6,300 పాయింట్ల స్థాయి నిరోధాన్ని(రెసిస్టెన్స్) కల్పిస్తుందని ఐ-సెక్ అంచనా వేసింది. అయితే ఆపై నిఫ్టీ నిలదొక్కుకోవడమేకాకుండా 6,700 పాయింట్లను చేరుతుందని అభిప్రాయపడింది. ఇందుకు బీజేపీ సాధించిన విజయాలు కారణంగా నిలుస్తాయని ఐ-సెక్ సీఈవో అనుప్ బాగ్చీ చెప్పారు. వచ్చే ఏడాది మొదట్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల వరకూ ఈ జోష్ కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐకు చెందిన బ్రోకింగ్ సంస్థే ఐ-సెక్. అయితే ఈ ర్యాలీ స్వల్పకాలమే కొనసాగుతుందని, ఆపై ఫండమెంటల్స్ ఆధారంగా ట్రెండ్ ఉంటుందని పేర్కొంది.