ఐఏఎస్ అధికారికి జైలు శిక్ష


- కోర్టు ధిక్కారం కింద ఖమ్మం మాజీ కలెక్టర్ ఇలంబర్తితో పాటు మరొకరికి..

- అప్పీల్‌కు వెళతాం:ప్రభుత్వం

- శిక్ష అమలు వాయిదా


సాక్షి, హైదరాబాద్: కోర్టు ధిక్కారం కేసులో ఖమ్మం జిల్లాకు గతంలో కలెక్టర్‌గా పనిచేసిన ఇలంబర్తితోపాటు సబ్ డివిజనల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్‌రెడ్డిలకు హైకోర్టు నాలుగు వారాల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు మంగళవారం తీర్పు వెలువరించారు. ఖమ్మం జిల్లా గోడూరు రెవెన్యూ గ్రామ పరిధిలో తమకున్న 14 ఎకరాల భూమి ఏడూళ్ల చెరువు నిర్మాణం సందర్భంగా మునిగిపోయిందని, అందుకు పరిహా రం ఇప్పించాలని కోరుతూ ఎం.రామకృష్ణ అనే వ్యక్తి 2010లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీన్ని విచారించిన హైకోర్టు.. ఆయనకు పరిహారం చెల్లించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను అధికారులు అమలు చేయలేదంటూ రామకృష్ణ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ రామచంద్రరావు.. అప్పటి జిల్లా కలెక్టర్ ఇలంబర్తి, శ్రీనివాస్‌రెడ్డికి నాలుగు వారాల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. అయితే తీర్పుపై అప్పీల్ దాఖలు చేస్తామని, అందువల్ల తీర్పు అమలును వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ... తీర్పు అమలును నాలుగు వారాల పాటు వాయిదా వేశారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు 

Read also in:
Back to Top