
నిధులన్నీ ఈ కామర్స్ వెంటే...
స్టార్టప్‌లయితే ‘ఫుడ్ ’కి సంబంధించిన కంపెనీలైతే చాలు. నిధులు భారీగా వస్తున్నాయి.
సాక్షి, బిజినెస్ విభాగం: స్టార్టప్‌లయితే ‘ఫుడ్ ’కి సంబంధించిన కంపెనీలైతే చాలు. నిధులు భారీగా వస్తున్నాయి. అదే ఆరంభించి వివిధ దశల్లో ఉన్న కంపెనీల విషయానికొస్తే మాత్రం ఈ కామర్స్‌దే హవా. ఇదీ గతేడాది నిధుల ప్రవాహం తీరు. అంటే ఈ-కామర్స్ కంపెనీలను ఆరంభించిన వెంటనే నిధులు రావటం లేదు. పోటీని తట్టుకుని అవి నిలబడితే... వాటి వ్యాపార తీరుపై నమ్మకం కలిగితేనే విదేశీ ఇన్వెస్టర్లు వరస కడుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మాత్రం కన్జూమర్ ఇంటర్నెట్, మొబైల్ యాప్స్, టెక్నాలజీ, వైద్యం, విద్య, మొదలైన విభాగాలకు చెందిన కంపెనీలు ఉన్నాయి. 2014 డేటా ప్రకారం అత్యధికంగా నిధులు అందుకున్న సంస్థల్లో నెంబర్-1 స్థానం ఫ్లిప్‌కార్ట్‌దే. ఇది అత్యధికంగా 1.9 బిలియన్ డాలర్లు సమీకరించింది.
దాని పోటీ సంస్థ స్నాప్‌డీల్ 860 మిలియన్ డాలర్లు సాధించింది. ఈ రెండూ ఈ-కామర్స్ కంపెనీలే. ఇక 210 మిలియన్ డాలర్లతో ఓలా క్యాబ్స్, 192 మిలియన్ డాలర్లతో శుభం హౌసింగ్ ఫైనాన్స్, 157 మిలియన్ డాలర్లతో న్యూస్‌హంట్ ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఇలా దాదాపు 50 పైచిలుకు ఈ-కామర్స్ సంస్థలు దాదాపు 3.23 బిలియన్ డాలర్ల ఫండింగ్ అందుకున్నాయి. మరోవైపు, భారీ స్థాయిలో నిధులు దక్కించుకున్న స్టార్టప్‌లలో ఆహార సంబంధిత కంపెనీలే ఎక్కువగా ఉండటం విశేషం. ఇందులో.. ఫుడ్‌పాండా, జొమాటో చెరి 60 మిలియన్ డాలర్లు సమీకరించాయి. ఆన్‌లైన్ కిరాణాస్టోరు బిగ్‌బాస్కెట్‌డాట్‌కామ్ సైతం 60 మిలియన్ డాలర్ల పైచిలుకు నిధులు దక్కించుకుంది. రియల్టీ సంస్థల్లోనూ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. కామన్‌ఫ్లోర్, హౌసింగ్‌డాట్‌కామ్, ఇండియాహోమ్స్ వంటి సంస్థలూ చెప్పుకోతగ్గ స్థాయిలోనే ఫండింగ్ సాధించాయి.
వ్యక్తిగత స్థాయిలో దిగ్గజాల పెట్టబడి...
స్టార్టప్‌లకు నిధులందించటంలో వెంచర్ ఫండ్లే కాక వ్యక్తులూ ముందుంటున్నారు. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా, విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ మొదలైనవారు ఇందులో ఉన్నారు. రతన్ టాటా .. స్నాప్‌డీల్, బ్లూస్టోన్, అర్బన్‌ల్యాడర్ వంటి సంస్థల్లో ఇన్వెస్ట్ చేశారు. ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ సంస్థ .. మింత్రాలో పెట్టుబడులు పెట్టింది. మింత్రాను ఆ తర్వాత ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసింది. మరోవైపు, తమ స్టార్టప్ కోసం ఫండింగ్ తెచ్చుకుంటున్న కొందరు వ్యక్తిగతంగా ఇతర స్టార్టప్‌లకూ తోడ్పాటు అందిస్తున్నారు. ఉదాహరణకు ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్‌లు మాడ్‌ర్యాట్ గేమ్స్, న్యూస్‌ఇన్ షార్ట్స్, అథర్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేశారు.