ఇక మరిన్ని షాక్‌లు! | Get ready for a phased hike in electricity bills | Sakshi
Sakshi News home page

ఇక మరిన్ని షాక్‌లు!

Sep 19 2013 2:10 AM | Updated on Sep 1 2017 10:50 PM

రాష్ట్ర ప్రజలకు మరిన్ని షాక్‌లు తప్పవు. ఇకపై ఏటా విద్యుత్ చార్జీలు భారీగా పెరగనున్నాయి. కరెంటు చార్జీలను ఏటా బాదేయాల్సిందేనని రాష్ట్రాలకు కేంద్ర విద్యుత్‌శాఖ స్పష్టం చేసింది.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు మరిన్ని షాక్‌లు తప్పవు. ఇకపై ఏటా విద్యుత్ చార్జీ లు భారీగా పెరగనున్నాయి. కరెంటు చార్జీలను ఏటా బాదేయాల్సిందేనని రాష్ట్రాలకు కేంద్ర విద్యుత్‌శాఖ స్పష్టం చేసింది. విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, పంపిణీ చేసేవరకు అయ్యే మొత్తం వ్యయాన్ని వినియోగదారుల నుంచే రాబట్టాలని తేల్చిచెప్పింది. ప్రస్తుతం యూనిట్ విద్యుత్ వాస్తవిక సగటు వ్యయానికి, వాస్తవిక సగటు వసూలుకు మధ్య తేడా భారీగా ఉందని పేర్కొంది. ఈ అంతరాన్ని వచ్చే 3 నుంచి 5 ఏళ్లలోగా భర్తీ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ నిర్వహణ బాధ్యత బిల్లు-2013ను కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ తీసుకొస్తోంది. ఇప్పటికే ముసాయిదా బిల్లును అన్ని రాష్ట్రాలకు పంపించింది. దీనిపై తగిన సూచనలు చేయాలని పేర్కొంది. తర్వాత ఈ బిల్లును ఆయా రాష్ట్రాలు తమ అసెంబ్లీల్లో ఆమోదించాలని ఆదేశిం చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు భారీగా పెరగనున్నాయని ఇంధనశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
 
 ఏటా బాదుడే బాదుడు: రాష్ట్రంలో ఒక యూనిట్ విద్యు త్‌ను ఉత్పత్తి చేసి, వినియోగదారులకు సరఫరా చేసేందుకు అవుతున్న సగటు వ్యయం రూ.5.23గా ఉంది. అయితే, వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న మొత్తం రూ. 3.57 మాత్రమే. వైఎస్సార్ హయాంలో ఒక్క పైసా విద్యుత్ చార్జీలు పెంచకపోవడమే ఇందుకు కార ణం. చార్జీలు పెంచకుండా.. సబ్సిడీ రూపం లో ఆ మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వం భరిం చింది. అయితే వైఎస్ మరణం తర్వాత ఏటా విద్యుత్ చార్జీలు పెంచుతూ వచ్చారు. రోశయ్య ప్రభుత్వం, కిరణ్ సర్కారు ఇప్పటివరకు రెగ్యులర్, సర్దుబాటు చార్జీల రూపం లో దాదాపు రూ.22 వేల కోట్లకుపైగా భారాన్ని ప్రజలపై మోపాయి. తాజాగా కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలవల్ల రాష్ర్ట ప్రజలపై మరోసారి విద్యుత్ భారం పడనుంది.
 
 ప్రస్తుతం రాష్ట్రంలో యూనిట్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, పంపిణీ చేసేందుకవుతున్న మొత్తానికి... వినియోగదారుని నుంచి వసూలు చేస్తున్న మొత్తానికి రూ.1.66 తేడా ఉంది. ఈ అంతరాన్ని వచ్చే 3 నుంచి 5 ఏళ్లలోగా భర్తీ చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది. దీంతో వచ్చే ఐదేళ్లపాటు రాష్ట్ర ప్రజలకు విద్యుత్ షాక్‌లు తగులుతూనే ఉంటాయన్నమాట. అలాగే ఏటా విద్యుత్ పంపిణీకవుతున్న మొత్తాన్ని వినియోగదారుని నుంచే రాబట్టుకోవాల్సిందేననీ కేంద్రం స్పష్టంచేసింది. వాస్తవానికి ఏటా విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ ఖర్చు పెరుగుతుంది. ఉత్పత్తికయ్యే ఇంధనం ధరలతోపాటు ఇతర ఖర్చులు పెరగడమే ఇందుకు కారణం. ఫలితంగా ప్రస్తుతమున్న అంతరాన్ని పూడ్చడంతోపాటు ఏటా విద్యుత్ ఉత్పత్తి, పంపిణీకి అయ్యే వ్యయం పెరుగుదల కూడా వినియోగదారులపై పడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement