మెరుగైన వర్షపాతం వంటి సానుకూల పరిణామాలతో ఇన్వెస్టర్లలో నిరాశావాదం క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో...
ముంబై: మెరుగైన వర్షపాతం వంటి సానుకూల పరిణామాలతో ఇన్వెస్టర్లలో నిరాశావాదం క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో సెన్సెక్స్ ఈ డిసెంబర్ నాటికి 22,000 పాయింట్ల రికార్డు స్థాయికి పెరగగలదని జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్ అంచనా వేసింది. గతంలో తాము ప్రకటించిన 21,000 పాయింట్ల లక్ష్యాన్ని సవరించి 22,000కి పెంచుతున్నట్లు తెలిపింది. 2008 జనవరి ఒకటిన 21,206.77 పాయింట్ల ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని తాకింది.
ఆ తర్వాత మళ్లీ.. గురువారం ఇంట్రాడేలో 21,039 పాయింట్ల స్థాయిని తాకింది. 2008లో సెన్సెక్స్ తన పీఈ నిష్పత్తికి 28.12 రెట్లు ట్రేడ్ కాగా.. గురువారం 18.89 రెట్లు ట్రేడ్ అయ్యింది. కరెంట్ అకౌంట్ లోటు తగ్గుతుండడం, ఎగుమతుల పెరుగుదల ధోరణి వంటి అంశాలను ఈ సందర్భంగా బ్యాంక్ ప్రస్తావించింది. మరోవైపు, పెట్టుబడులకు అనుకూలమైన రంగాల జాబితాలో ఐటీ సర్వీసులను తప్పించి బ్యాంకులను చేర్చింది. ఐటీ సేవలకు న్యూట్రల్ రేటింగ్ ఇచ్చింది. యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, కోల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్ వంటి సంస్థలు మెరుగైన పనితీరు కనబర్చగలవని డాయిష్ బ్యాంక్ అంచనా వేసింది.