మరోసారి ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు! | Delhi Gears Up for Fresh Assembly Elections | Sakshi
Sakshi News home page

మరోసారి ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు!

May 27 2014 3:26 PM | Updated on Aug 20 2018 3:46 PM

ఢిల్లీలో మరోసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.


న్యూఢిల్లీ: మరోసారి ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల సమరానికి తెరలేవనుంది. ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు జరిపించడమే ఉత్తమమని నిర్ణయించినట్టు తెలుస్తోంది.  ఢిల్లీలో రాష్ట్రపతి పాలనను కొనసాగించాలా వద్దా అనేదానిపై లోక్‌సభ ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పిన నజీబ్ జంగ్  కేంద్రంలో  కొత్త ప్రభుత్వం ఏర్పాటుకావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత రెండు నెలలుగా రాజధానిలో రాజకీయ పరిస్థితులను  నిశితంగా గమనిస్తోన్న ఆయన  ఒకటి రెండు రోజులలో రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి  నగరంలో తాజా రాజకీయ పరిస్థితిపై నివేదిక అందజేసే అవకాశముంది.

 

ఈ మేరకు రాష్ట్రపతిని నజీబ్ జంగ్ కలుస్తారని ప్రాధమిక సమాచారం. ఢిల్లీలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి సంసిద్ధంగా లేకపోవడంతో ఎన్నికలు జరిపించడమొక్కటే మార్గమని ఎల్జీ నిర్ణయించారని, గత వారం రాష్ట్రపతితో ఆయన  మాట్లాడారని రాజ్‌నివాస్ వర్గాలు తెలిపాయి. ఆప్ మాటమార్చే వైఖరి పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నారని , బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే జంగ్‌కు తెలిపాయని వెల్లడించాయి. ఎన్నికలపై అభిప్రాయమేమిటో  తెలుసుకోవడం కోసం ఆయన బీజేపీ నేతలతోనూ  మాట్లాడారు. నజీబ్‌ జంగ్ నవంబర్‌లో ఎన్నికలు జరిపించాలని కోరవచ్చని తెలిపాయి. కాగా, మొదట అసెంబ్లీని  రద్దు చేసి ఎన్నికలు జరిపించాలని కోరిన ఆమ్ ఆద్మీ పార్టీ లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత మాటమార్చింది. ఆప్ కన్వీనర్ అర్వింద్  కేజ్రీవాల్ గతవారం నజీబ్ జంగ్‌ని కలిసి అసెంబ్లీని వెంటనే రద్దు చేయరాదని,  ప్రభుత్వం ఏర్పాటుచేయడంపై ప్రజాభిప్రాయం తెలుసుకోవడం కోసం తాము జనసభలు జరుపుతామని  చెప్పారు. కానీ ఆ మరుసటి రోజే విలేకరుల సమావేశం నిర్వహించి తాము ప్రజాభిప్రాయాన్ని సేకరించబోవడం లేదని, ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారు.  ఇదిలా ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు మద్ధతివ్వమని ప్రకటించిన కాంగ్రెస్ ఎల్జీని కలిసి ఎన్నికలు నిర్వహించాలని కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement