గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాదుల దాడిని లోక్‌సభ తీవ్రంగా ఖండించింది. పార్టీలకతీతంగా సభ్యులందరూ దాడిని గర్హించారు.
నిఘా సమాచారంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది: కాంగ్రెస్
న్యూఢిల్లీ: గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాదుల దాడిని లోక్‌సభ తీవ్రంగా ఖండించింది. పార్టీలకతీతంగా సభ్యులందరూ దాడిని గర్హించారు. దేశానికి ముప్పుగా కొనసాగుతున్న ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు ప్రభుత్వం తన శక్తినంతటినీ వినియోగించాలని కోరారు. సోమవారం ఒకవైపు గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాదులతో భద్రతాదళాల ఎదురు కాల్పులు కొనసాగుతుండగానే.. లోక్‌సభలో జీరో అవర్‌లో కాంగ్రెస్, లెఫ్ట్, ఎన్‌సీపీ, టీఎంసీ, ఎస్‌పీ, ఆర్‌జేడీ, జేడీయూ, టీఆర్‌ఎస్ సభ్యులు వివిధ అంశాలపై ఆందోళన కొనసాగిస్తున్న సమయంలోనే..
అకాలీదళ్, బీజేపీ, సీపీఎం, బీజేడీ సభ్యులు ఉగ్రదాడిని ఖండిస్తూ మాట్లాడారు. అనంతరం.. కాంగ్రెస్ నేత ఖర్గే మాట్లాడుతూ.. ఉగ్రవాద దాడిని ఖండిస్తూనే కేంద్ర ప్రభుత్వ నిఘా వైఫల్యముందన్నారు. మంత్రి వెంకయ్య తీవ్రంగా స్పందిస్తూ.. ‘ఇది చాలా తీవ్ర విషయం. జాతీయ అంశం. ఎదురుకాల్పులు జరుగుతుండగా ప్రభుత్వాన్ని తప్పుపట్టాలని ప్రయత్నించటం సరికాదు. ఇది పైచేయి సాధించే సమయం కాదు. ఈ విషయంలో సభ ముక్తకంఠం వినిపించాలి’ అని ఉద్ఘాటించారు. ‘జనం చనిపోతున్నారు.
దేశ ప్రజలు చూస్తున్నారు. వాళ్లు నాటకాన్ని (సభలో) చూస్తున్నారు’ అని ప్రేమ్‌సింగ్(అకాళీ) అన్నారు. దాడి జరిగే అవకాశముందన్న సమాచారం ఉన్నపుడు పంజాబ్ సరిహద్దును ఎందుకు మూసివేయలేదని అకాలీదళ్.. ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తన నియోజకవర్గమైన గురుదాస్‌పూర్‌లో జరిగిన దాడి దిగ్భ్రాంతి కలిగిస్తోందని ఎంపీ వినోద్‌ఖన్నా పేర్కొన్నారు.