
రెబల్స్ తో శాంతి ఒప్పందాలు చేసుకున్న కొలంబియా అధ్యక్షుడు జువాన్ మాన్యుయెల్ శాంటోస్ (ఫైల్ ఫొటో)
50 ఏళ్ల రక్తచరిత్రకు చరమగీతంపాడుతూ ఫార్క్ సేనలతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్న కొలంబియా అధ్యక్షుడు జువాన్ మాన్యుయెల్ శాంటోస్ కు నోబెల్ శాంతి పురస్కారం లభించింది.
ఓస్లో: ప్రపంచంలోనే సంపన్నమైన గెరిల్లా గ్రూప్.. ఐదు దశాబద్ధాలుగా సాయుధ పోరాటం.. అంతర్యుద్ధంలో 2.5 లక్షల మంది హతం.. 10 లక్షల మంది నిరాశ్రయులు.. ఇదీ.. అపార సహజ నిక్షేపాల ఖని కొలంబియాలో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోన్న వామపక్ష కొలంబియా విప్లవ సాయుధ సైన్యం(ఫార్క్) వర్తమాన చరిత్ర. అలాంటి కాకలు తీరిన గెరిల్లాల చేత శాంతి సంతకాలు చేయించడం సాధారణ విషయమేమీకాదు! 50 ఏళ్ల రక్తచరిత్రకు చరమగీతంపాడుతూ ఫార్క్ సేనలతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్న ఘనత కొలంబియా అధ్యక్షుడు జువాన్ మాన్యుయెల్ శాంటోస్ ది. (తప్పక చదవండి: భూమిలేని శాంతి సాధ్యమా?!)
అందుకే 2016 సంవత్సరానికిగానూ జువాన్ మాన్యుయెల్ శాంటోస్ కు నోబెల్ శాంతి పురస్కారం లభించింది. శుక్రవారం నోబెల్ కమిటీ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. సంక్షుభిత లాటిన్ అమెరికా నుంచి నోబెల్ శాంతి బహుమతి దక్కించుకున్న అతికొద్ది మందిలో శాంటోస్ ఒకరు. సోషల్ పార్టీ ఆఫ్ నేషనల్ యూనిటీకి చెందిన ఆయన 2010 నుంచి కొలంబియా అధ్యక్షడిగా కొనసాగుతున్నారు. గత నాలుగేళ్ల నుంచి ఫార్క్ రెబల్స్ తో శాంతి చర్చలు జరిపిన ఆయన చివరికి ఈ ఏడాది సెప్టెంబర్ లో శాతి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అయితే ఒప్పందం కుదిరిన తర్వాత దేశంలో నిర్వహించిన రిఫరెండం ఫలితాలు వ్యతిరేకంగా రావడంతో ప్రస్తుతానికి శాంతికి కామా పడింది. ఏది ఏమైనప్పటికీ కొలంబియాలో శాంతి స్థాపనకు శాంటోస్ కృషి చెప్పుకోదగింది. (చదవండి: కొలంబియా షాక్!)