శాంటోస్‌కు శాంతి నోబెల్ | Nobel Peace Prize for Colombia's Juan Manuel Santos | Sakshi
Sakshi News home page

శాంటోస్‌కు శాంతి నోబెల్

Oct 8 2016 6:16 AM | Updated on Sep 4 2017 4:32 PM

శాంటోస్‌కు శాంతి నోబెల్

శాంటోస్‌కు శాంతి నోబెల్

కొలంబియా అధ్యక్షుడు జువాన్ మాన్యుయెల్ శాంటోస్‌ను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం వరించింది. కొలంబియాలో ఐదు దశాబ్దాలుగా...

కొలంబియా అధ్యక్షుడికి పురస్కారం..
* 50 ఏళ్ల అంతర్యుద్ధానికి తెరదించేందుకు శాంటోస్ అవిరళ కృషి
* తిరుగుబాటు దళాలతో చర్చలు జరిపి చారిత్రక శాంతి ఒప్పందం
* అయితే ఒప్పందాన్ని రెఫరెండంలో తిరస్కరించిన కొలంబియన్లు

ఓస్లో: కొలంబియా అధ్యక్షుడు జువాన్ మాన్యుయెల్ శాంటోస్‌ను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం వరించింది.

కొలంబియాలో ఐదు దశాబ్దాలుగా సాగుతున్న అంతర్యుద్ధానికి తెరదించేందుకు చేస్తున్న కృషికి గుర్తింపుగా నోబెల్ కమిటీ 2016 సంవత్సరానికిగాను శాంటోస్ పేరును ఈ అవార్డుకు ఎంపిక చేసింది. దేశంలో శాంతి నెలకొల్పేందుకు నాలుగేళ్లుగా తిరుగుబాటు దళం రివల్యూషనరీ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా(ఎఫ్‌ఏఆర్‌సీ) చీఫ్ రోడ్రిగో లండనో అలియాస్ టిమోలియన్ టిమోచెంకో జిమెనేజ్‌తో శాంటోస్ చర్చలు జరుపుతున్నారు. గత నెల 26న వీరి మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. అయితే ఈ చారిత్రక ఒప్పందానికి సంబంధించి ఈ నెల 2న నిర్వహించిన రెఫరెండంలో ఓటర్లు దానికి వ్యతిరేకంగా ఓటు వేసి దేశ భవితవ్యాన్ని సందిగ్ధంలో పడేశారు. అయినా కూడా నోబెల్ కమిటీ శాంటోస్ పేరును నోబెల్ శాంతి బహుమతి కోసం ఎంపిక చేయడం విశేషం.
 
ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి
నోబెల్ కమిటీ చైర్‌పర్సన్ కచీ కుల్‌మన్ ఫైవ్ స్పందిస్తూ.. 50 ఏళ్ల అంతర్గత పోరాటానికి ముగింపు పలకడం కోసం శాంటోస్ చేసిన అవిరళ కృషికి గుర్తింపుగా ఆయన పేరును అవార్డుకు ఎంపిక చేసినట్టు చెప్పారు. యుద్ధ మేఘాలు కమ్మేసిన దేశంలో శాంతిని నెలకొల్పడమే తమ లక్ష్యమని చెప్పారు. శాంతి కోసం చేపట్టే చర్యలకు ఊతం ఇచ్చేందుకు, అలాగే అన్ని వర్గాలు ఈ ప్రక్రియలో పాలుపంచుకునేందుకు ఈ అవార్డు దోహదం చేస్తుందని తెలిపారు. ఈ అవార్డు శాంతిపై నమ్మకం కోల్పోని కొలంబియన్లకు.. అలాగే అంతర్గత పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అంకితమన్నారు. అయితే ప్రస్తుతం కొలంబియా ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య ఉందని శాంటోస్‌ను నోబెల్ కమిటీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అన్ని వర్గాలను చర్చలకు ఆహ్వానించి జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం సాధించేందుకు శాంటోస్ కృషి చేయాలని సూచించింది.
 
ఐదు దశాబ్దాల అంతర్గత పోరు..
దక్షిణ అమెరికా ఖండ దేశమైన కొలంబియాలో అంతర్యుద్ధం వల్ల 2,60,000 మంది ప్రాణాలు కోల్పోగా, 45 వేల మంది ఆచూకీ లేకుండా పోయారు. 60 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వామపక్ష  గెరిల్లా గ్రూపులు, రైట్ వింగ్ పారామిలిటరీ దళాలు, డ్రగ్ ముఠాల మధ్య దాడులతో దేశం అల్లకల్లోలంగా మారింది. అయితే రెఫరెండం ఫలితం వల్ల కొలంబియాకు నోబెల్ శాంతి బహుమతి వచ్చే అవకాశాలు తక్కువని నిఫుణులు భావిస్తున్న తరుణంలో కమిటీ శాంటోస్ పేరును ఎంపిక చేయడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. శాంటోస్‌తో పాటు తిరుగుబాటు నాయకుడు జిమేనేజ్‌కు బహుమతి ప్రకటించకపోవడంపైనా వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
 
నోబెల్ కమిటీకి ధన్యవాదాలు: శాంటోస్
తనను నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసిన నోబెల్ కమిటీకి శాంటోస్ ధన్యవాదాలు తెలిపారు. కొలంబియన్లందరి తరపునా.. ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయిన ప్రజల తరఫున  మనస్ఫూర్తిగా కమిటీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.  దేశ ప్రజల వల్లే తనకు ఈ అవార్డు వచ్చిందన్నారు. శాంతియుతంగా జీవించడం కంటే మంచి కారణం సమాజానికి ఏదీ ఉండదని, ఏ దేశానికైనా కావాల్సింది అదే అని పేర్కొన్నారు.

కొలంబియాలో శాంతిని నెలకొల్పేందుకు ఈ అవార్డు ఒక గొప్ప ఉత్ప్రేరకంగా పనిచేస్తుందన్నారు. మరోవైపు కొలంబియాలో శాంతిని నెలకొల్పే ప్రక్రియకు నోబెల్ పురస్కారం దోహదం చేస్తుందని ఐక్యరాజ్యసమితి  పేర్కొంది. కాగా, శాంటోస్‌కు నోబెల్ పురస్కారం లభించడాన్ని తిరుగుబాటు నాయకుడు జిమేనేజ్ స్వాగతించారు. మార్క్సిస్టు గెరిల్లాలు కోరుకునే ఏకైక బహుమతి కొలంబియాలో సామాజిక న్యాయం, శాంతి మాత్రమే అని ఆయన వ్యాఖ్యానించారు.
 
వ్యూహం మార్చి.. ప్రేమను పంచి
శాంటోస్.. కొలంబియాలో రాజకీయ, రాజ్యాంగ సంస్కరణలకోసం తీవ్రంగా శ్రమించారు.  కానాస్ వర్సిటీ(యూఎస్), లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో ఉన్నతవిద్యను అభ్యసించిన శాంటోస్.. తన కుటుంబం ఆధీనంలో ఉన్న ‘ఎల్ టింపో’ అనే వార్తాపత్రిక బాధ్యతలూ చూసుకున్నారు. కొలంబియా కాఫీ తోటల యజమానుల సంఘానికి ఆర్థిక సలహాదారుగా.. కొలంబియా అంతర్జాతీయ కాఫీ ఆర్గనైజేషన్ సభ్యుడిగా పనిచేశారు. రాజకీయాల్లోకి వస్తూనే.. కొలంబియా తొలి వాణిజ్య మంత్రి అయ్యారు. కొంత కాలానికి రక్షణ శాఖ బాధ్యతా తీసుకున్నారు. ఆ సమయంలో ఫార్క్ రెబల్స్‌పై ఉక్కుపాదం మోపారు. అయితే.. 2010లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక వ్యూహాన్ని మార్చి.. ఫార్క్ దళంతో శాంతి చర్చలకోసం ప్రయత్నించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement