చాక్లెట్ బాక్స్ @ రూ. 10 కోట్లు..

చాక్లెట్ బాక్స్ @ రూ. 10 కోట్లు..


పిల్లలు, పెద్దలూ ఇష్టంగా తినే వాటిలో చాక్లెట్లు ఒకటి. ముఖ్యంగా చిన్న పిల్లలకు వీటి మీద మక్కువ మరీ ఎక్కువ. వాళ్ల చేత హోమ్‌వర్క్ చేయించాలన్నా, కాసేపు కుదురుగా ఉంచాలన్నా చిన్నారులకు ఇదొక మంత్రదండంలా పనిచేస్తుంది. అయితే ఇప్పుడు  చెప్పబోయే చాక్లెట్‌లు సాధారణమైనవి కాదు.  ఏమిటి అంత ప్రత్యేకత అనుకుంటున్నారా.. వీటిని కొనాలంటే కోట్లు గుమ్మరించాల్సిందే. అవేమిటో మనమూ తెలుసుకుందామా..!

 

లే చాక్లెట్ బాక్స్..

ఈ చాక్లెట్ బాక్స్ ఖరీదు సుమారు రూ. 10 కోట్లు. ఒక్కసారి చూస్తే దృష్టిని మరల్చుకోలేనంత సర్వాంగ సుందరంగా.. బంగారం, వజ్రాలతో ఈ చాక్లెట్ బాక్స్‌ను డిజైన్ చేస్తారు. విదేశాల్లో కుబేరుల వారసులు తమ ప్రేమను వ్యక్తం చేసేందుకు వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారట. ఈ కళాత్మక నిర్మాణాన్ని సిమన్ అనే ఆభరణాల తయారీ సంస్థ రూపొందించింది. విదేశాల్లో మహిళలు ఎక్కువగా ఇష్టపడే వాటిలో డైమండ్స్, చాక్లెట్స్ తొలి రెండు స్థానాల్లో నిలుస్తున్నాయి. అందుకే వారిని ఆకర్షించేందుకు ఈ రెండిటిని ఉపయోగించుకుని దీన్ని తయారు చేశారు.



 ఫ్రోజెన్ హాట్...

 ప్రపంచంలోనే అత్యంత అరుదుగా లభించే 28 కోకా రకాలు, 5 గ్రామల 23 క్యారెట్ల కరిగే బంగారాన్ని ఉపయోగించి ఈ చాక్లెట్‌ను తయారు చేస్తారు. దీని పేటెంట్ హక్కును న్యూయార్క్ సిటీ ఈటరీ దక్కించుకుంది. దీని ధర సుమారు రూ. 65 లక్షలు. చూడగానే నోరూరించేలా ఆకర్షణీయంగా దీన్ని అలంకరిస్తారు. అత్యంత ఖరీదైన చాక్లెట్‌గా గిన్నిస్ రికార్డుల్లో కెక్కింది. అందమైన వెండి గ్లాసులో చాక్లెట్‌ను ఉంచి ఆ గ్లాసును గోల్డ్ బ్రాస్‌లెట్‌తో అలంకరించి మనకు అందిస్తారు. దీన్ని తినడానికి అందించే స్పూన్‌కూడా బంగారంతో చేసిందే.



గోల్డెన్ స్పెక్లెడ్ ఎగ్..

ఈ ఎగ్ విలియం కర్లీ అద్బుత సృష్టి. ఎటువంటి బంగారు పదార్థాలు ఉపయోగించకుండా ఇలాంటి ప్రత్యేక (కోడిగుడ్డు) ఆకారంలో చాక్లెట్‌ను రూపొందించినందుకు కర్లీకి గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కింది. మొదటిసారిగా తయారైన దీన్ని వేలం వేయగా రూ. 8 లక్షలకు పైగా ధర పలికింది. ఈ గుడ్డు పైపొర అంతా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్ రకంగా పేరొందిన అమెదేయ్‌తో పూత పూస్తారు. ఈ చాక్లెట్ అంతా ఒకే రుచిలో ఉండదు. లోపల, మధ్యలో, బయట.. ఒక్కోచోట ఒక్కో ప్రత్యేకమైన రుచిని కలిగి ఉండటం దీని ప్రత్యేకత.



స్వరోవ్‌స్కి స్టుడ్డెడ్..

ఇవి ఒక్కోబాక్స్‌లో 49 చాక్లెట్‌లు ఉంటాయి. తెలియని వారు వీటిని బంగారు ఆభరణాలు అనుకుంటారు గానీ తినే చాక్లెట్‌లు అనుకోరు. అంత అందంగా వీటిని డిజైన్ చేస్తారు. వీటి ధర రూ. 6,50,000. లెబనాన్‌కు చెందిన ప్రముఖ చాకొలేటర్ దీనికి రూపకల్పన చేశారు. గోల్డ్, క్రిస్టల్స్, ఇండియన్ సిల్క్ ఉపయోగించి వీటిని ఆకర్షణీయంగా అలంకరిస్తారు.

 

నిప్స్‌చిల్డ్ చాక్లెట్..

ఎటువంటి పరికరాలు ఉపయోగించకుండా కేవలం చేతితో తయారు చేయడం ఈ చాక్లెట్స్ ప్రత్యేకత. ఫ్రిట్జ్ నిప్స్‌చిల్డ్ అనే చాక్లెట్ తయారీ నిపుణుడు వీటిని తయారు చేశారు.  మిగిలిన చాక్లెట్‌లతో పోల్చుకుంటే విభిన్నమైన, ప్రత్యేక రుచిని కలిగి ఉండటం దీని ప్రత్యేకత. ప్యాకింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. దీని ధర సుమరు రూ.1,70,000.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top