‘ఓటుకు కోట్లు’ కుట్ర తేలుస్తాం | cash for vote case: ACB submits memo to special court | Sakshi
Sakshi News home page

‘ఓటుకు కోట్లు’ కుట్ర తేలుస్తాం

Published Thu, Sep 1 2016 1:56 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

‘ఓటుకు కోట్లు’ కుట్ర తేలుస్తాం - Sakshi

‘ఓటుకు కోట్లు’ కుట్ర తేలుస్తాం

ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కుట్రలో పాత్రధారులెవరో కనిపెట్టే దిశగా దర్యాప్తు చేస్తున్నామని ప్రత్యేక కోర్టుకు ఏసీబీ నివేదించింది.

- ‘ఓటుకు కోట్లు’పై ప్రత్యేక కోర్టులో ఏసీబీ మెమో
- ప్రాథమికంగా నలుగురు నిందితులపై చార్జిషీట్
- దర్యాప్తు పూర్తికాగానే అనుబంధ చార్జిషీట్


సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కుట్రలో పాత్రధారులెవరో కనిపెట్టే దిశగా దర్యాప్తు చేస్తున్నామని ప్రత్యేక కోర్టుకు ఏసీబీ నివేదించింది. కుట్రను నిరూపించేందుకు అవసరమైన అన్ని ఆధారాలను సేకరిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు బుధవారం ప్రత్యేక కోర్టులో ఏసీబీ మెమో దాఖలు చేసింది. దర్యాప్తులో వెలుగుచూసిన అంశాల ఆధారంగా అనుబంధ చార్జిషీట్ దాఖలు చేస్తామని స్పష్టం చేసింది.

ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై దర్యాప్తు చేయాలంటూ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలంటూ ప్రత్యేక కోర్టు ఆదేశించిందని, అయితే ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో ఉన్న నేపథ్యంలో మరో ఎఫ్‌ఐఆర్ జారీచేయాల్సిన అవసరం లేదని ఏసీబీ నివేదించింది. దర్యాప్తులో వెగులుచూసిన అంశాల ఆధారంగా అనుబంధ చార్జిషీట్ దాఖలు చేస్తామని స్పష్టం చేసింది. దర్యాప్తు పురోగతిని ఈ మెమో ద్వారా ఏసీబీ కోర్టు దృష్టికి తెచ్చింది.

కుట్రదారుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది
ఈ కేసులో పాలుపంచుకున్న కుట్రదారులందరిపైనా దర్యాప్తు సాగుతోందని, వారి పాత్రకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నామని మెమోలో వివరించింది. రేవంత్‌రెడ్డి, హ్యారీ సెబాస్టియన్, ఉదయ్ సింహల పాత్రకు సంబంధించిన ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేశామని పేర్కొంది. అలాగే వీరి స్వర నమూనాలు, ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపామని, వారిచ్చిన నివేదిక ఆధారంగా ఈ చార్జిషీట్ దాఖలు చేశామని మెమోలో వివరించారు.

రేవంత్ సహా ముగ్గురికి సమన్లు.. 29న హాజరుకావాలని ఆదేశం
ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టు విచారణకు (సీసీ నెంబర్ 15/2016...కాగ్నిజెన్స్) స్వీకరించింది. ఈ చార్జిషీట్‌లో నిందితులుగా ఉన్న రేవంత్‌రెడ్డి, హ్యారీ సెబాస్టియన్, ఉదయ్ సింహలకు కోర్టు సమన్లు జారీచేసింది. సెప్టెంబర్ 29న ప్రత్యక్షంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి విక్టర్ ఇమాన్యూయేల్ బుధవారం ఆదేశాలు జారీచేశారు.

14 నెలల తర్వాత మళ్లీ కదలిక
ఓటుకు కోట్లు కేసులో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఈవ్యవహారంలో గత ఏడాది జూలై 28న నలుగురు నిందితులపై ఏసీబీ చార్జిషీట్ దాఖలు చేసింది. దాదాపు 14 నెలలుగా ఈ కేసు దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదు. ఇక మూసేసిన దశలో ఉన్న ఈ కేసును వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదుతో మళ్లీ దర్యాప్తు చేయాల్సి వస్తోంది. ఈ కుట్రలో చంద్రబాబునాయుడు పాత్రకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు సమర్పించిన నేపథ్యంలో...ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలని ప్రత్యేక కోర్టు ఏసీబీని ఆదేశించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో..14 నెలలుగా మూలనపడేసిన ఈ కేసులో ఏసీబీ అనివార్యంగా దర్యాప్తును తిరిగి ప్రారంభించింది. మన వాళ్లు బ్రీఫ్‌డ్ మీ వాయిస్ చంద్రబాబునాయుడిదేనని ముంబాయికి చెందిన ఫోరెన్సిక్ సంస్థ నిర్ధారించిన నేపథ్యంలో ఈ కుట్రలో ఆయన పాత్ర స్పష్టమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement