
'ఓటుకు కోట్లు'లో బాబు నిందితుడే!
‘ఓటుకు కోట్లు’ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రపై కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేసింది.
- ఏసీబీ కసరత్తు షురూ
- నిందితుల జాబితాలో ఏపీ సీఎం పేరు చేర్చే అవకాశం
- న్యాయనిపుణుల సలహా మేరకు నేడు కీలక నిర్ణయం
- ప్రత్యేక కోర్టు తీర్పు నేపథ్యంలో ఉన్నతస్థాయి సమావేశం
- గవర్నర్‌తో కేసీఆర్, తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్ భేటీ
- బాబు పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నాయన్న నిపుణులు
- ఈపాటికే చేర్చాల్సిందంటున్న రిటైర్డ్ పోలీసు అధికారులు
- చార్జిషీట్‌లో 33 సార్లు చంద్రబాబు పేరు
- ఆ గొంతు బాబుదేనన్న ముంబై ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రపై విచారణ జరపాల్సిందిగా ఏసీబీని ఆదేశిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దర్యాప్తు ప్రక్రియ వేగం పుంజుకుంది. న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలు మంగళవారం అందడంతో ఏసీబీ కసరత్తు ముమ్మరమయ్యింది. ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసి సెప్టెంబర్ 29లోగా నివేదిక అందజేయాలని న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెల్సిందే. నెలరోజుల్లోగా విచారణ పూర్తి చేయాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు ప్రక్రియ వేగాన్ని మరింత పెంచాలని నిర్ణయించారు.
మంగళవారం నాడు సమావేశమైన ఏసీబీ ఉన్నతాధికారులు న్యాయస్థానం ఆదేశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. చంద్రబాబు పాత్రకు సంబంధించి తదుపరి చర్యల కోసం న్యాయ సలహా తీసుకోవాలని ఏసీబీ భావిస్తోంది. అందుకోసం న్యాయస్థానం వెలువరించిన తీర్పు ప్రతిని న్యాయనిపుణులకు ఏసీబీ అధికారులు పంపించారు. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలున్నందున చంద్రబాబు పేరును నిందితుల జాబితాలో చేర్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌లు మంగళవారంనాడు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఏసీబీ ప్రత్యేక కోర్టు తీర్పు నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ‘ఓటుకు కోట్లు’ కేసులో కోర్టు తీర్పు, తదనంతర పరిణామాలపై గవర్నర్‌తో వీరు చర్చించినట్లు సమాచారం. వీరితోపాటు తెలంగాణ అడ్వకేట్ జనరల్ కూడా ఈ భేటీలో పాల్గొనడం గమనార్హం. కాగా ఎన్నడూ లేనిది ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు రెండుగంటల సేపు గవర్నర్ నివాసమైన రాజ్‌భవన్‌లో గడపడం విశేషం.
ప్రాథమిక ఆధారాలున్నాయంటున్న న్యాయనిపుణులు
‘ఓటుకు కోట్లు’ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని నిందితునిగా చేర్చేందుకు అవసరమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది తెలంగాణలో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ముట్టజెప్పిన కేసులో ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సహా మరికొందరిని నిందితులుగా చేరుస్తూ అవినీతి నిరోధక శాఖ గతంలో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. నేరుగా స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడటంతో ఆయననే అసలు సూత్రధారిగా భావించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
చంద్రబాబు స్థానంలో మరొకరు ఉంటే నిందితునిగా చేర్చకుండా ఉంటారా అని రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు. పైగా ఏసీబీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో చంద్రబాబు పేరు 33 సందర్భాల్లో ప్రస్తావనకు వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో అసలు నిందితుడు చంద్రబాబే కనుక ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలంటూ వైఎస్సార్‌సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ‘ఏసీబీ కోర్టు తీర్పు నేపథ్యంలో చంద్రబాబునాయుడు పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాల్సిందే. ఇప్పటికే ఆయనకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు కూడా లభ్యమయ్యాయి’ అని రిటైర్డ్ డీజీపీ ఒకరు అన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా డీజీపీగా పని చేసిన ఆ రిటైర్డ్ అధికారి ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. చంద్రబాబు కాకుండా మరొకరు ఉంటే కేసు పెట్టకుండా ఉండేవారా అని ఆయన ప్రశ్నించారు. ఏసీబీ ప్రత్యేక కోర్టు తీర్పు వల్ల అయినా అటు ఏసీబీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన దిశగా కేసును విచారిస్తాయని ఆశిస్తున్నానని మాజీ న్యాయమూర్తి ఒకరు వ్యాఖ్యానించారు. ఉన్నతమైన పదవిలో ఉన్నంత మాత్రాన తప్పుడు పనులు చేసిన వారిని ఎలా వదిలేస్తారని ఆ మాజీ న్యాయమూర్తి ప్రశ్నించారు.
ఇప్పటికే చార్జిషీట్‌లో పేరు ప్రస్తావన..
ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఏపీ సీఎం చంద్రబాబు పేరును పలు మార్లు ప్రస్తావించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణల్లో చాలా స్పష్టంగా చంద్రబాబు పేరు ప్రస్తావించారు. అలాగే ఏ-1 నిందితుడు, నేరుగా డబ్బులు అందజేసిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కూడా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన సంభాషణల్లో కూడా ‘బాస్’ ఆదేశాల మేరకు తాను వచ్చినట్లు చెప్పుకొచ్చారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఏసీబీ కూడా న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జిషీట్‌లో సీఎం చంద్రబాబు పేరును దాదాపు 33 చోట్ల ప్రస్తావించింది. అలాగే స్టీఫెన్‌సన్ ఫోన్‌లో రికార్డు అయిన వాయిస్ నిజమైనదేనని, ఎక్కడా కట్, పేస్టులు లేవని, ఒకే నిడివిగల సంభాషణ అని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ కూడా న్యాయస్థానానికి నివేదిక ఇచ్చింది. ఈ వాయిస్ విషయంలో ముంబైకి చెందిన డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబోరేటరీ.. ఆ గొంతు చంద్రబాబుదేనని నిర్ధారించింది. దీంతో వాయిస్ విషయంలో స్పష్టత రావడంతో సీఎం చంద్రబాబు పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలని యోచిస్తోంది.
అయితే న్యాయస్థానంలో ప్రైవేటు పిటీషన్ దాఖలు చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాత్రం సీఎం చంద్రబాబుపై అవినీతి నిరోధక చట్టం సెక్షన్-12, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 120(బి)కింద కేసు నమోదు చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో న్యాయ నిఫుణుల సలహా మేరకు ఏ క్లాజు ప్రకారం చేర్చాలనే విషయంలో ఏసీబీ అధికారులు చర్చలు జరుపుతున్నారు.