గణేశ్ ఉత్సవాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

గణేశ్ ఉత్సవాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Published Sat, Aug 29 2015 11:19 AM

గణేశ్ ఉత్సవాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

మరికొద్ది రోజుల్లో గణపతి నవరాత్రి వహోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వేడుకల నిర్వహణపై బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ముంబై నగరంలోని ప్రఖ్యాత శివాజీ పార్కులో రథయాత్ర నిర్వహించేందుకు అనుమతి కోరుతూ ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ శ్రీకృష్ణా కాన్షియస్నెస్) సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం విచారించిన కోర్టు ఈ విధంగా స్పందించింది..

న్యాయ నిబంధనల దృష్ట్యా ఇలాంటి కార్యక్రమాలకు మేం వ్యతిరేకం అంటూనే నగరంలోని అన్ని ప్రాంతాలు స్తంభించిపోయేలా గణేశ్ చతుర్థి, నవరాత్రి, ఇతర ముఖ్య పండుగలను భారీ హంగులతో బహిరంగంగా నిర్వహించడం ఇకనైనా మానుకోవాలని సూచించింది. ఒక వార్డుకు ఒక మండపం మాత్రమే ఉండాలని జస్టీస్ వీఎం కనడే, షాలిని పన్సల్కర్ లతో కూడిన ధర్మాసనం అభిప్రాయాపడింది.

'ఒకవేళ లోకమాన్య తిలక్ గనుక బతికుంటే.. ప్రస్తుతం ఉత్సవాలు జరుగుతున్న తీరును తప్పక నిరసించేవారు. ఇంత భారీగా జరుగుతున్న తంతుతో ఎవరికి లాభం? వినాయక మండపాల పేరుతో ప్రజల నుంచి డబ్బులు గుంజుతున్నారు. నిజం చెప్పాలంటే ఇవి ఫక్తు బలవంతపు వసూళ్లే. మండపాల వద్ద పెద్ద పెద్ద మైక్ సెట్లతో భారీ శబ్ధాలు. ఏం? గణేశ్ పూజలు నిశ్శబ్ధంగా నిర్వహించలేమా!'అని కోర్టు మండిపడింది.

ప్రజలు భారీ ఎత్తున పాల్గొనే రథయాత్రను క్రీడా ప్రాంగణంలో నిర్వహించేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఇస్కాన్ కు తేల్చిచెప్పిన కోర్టు.. రథయాత్ర వల్ల గ్రౌండ్ పరిసరాలేకాక, పిచ్ కూడా దెబ్బతింటుందని, తద్వారా చిన్నారులు, యువకులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని పేర్కొంది. పూరీలో జగన్నాథ రథయాత్రను ప్రస్తావిస్తూ  ఆ ఉత్సవం భారీ రహదారిపై జరుగుతుంది గనుక సమంజసమేనని తెలిపింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement