255 రాజకీయ పార్టీలకు ఈసీ ఝలక్!
నల్లధనంపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా నమోదైన 255 రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది.
నల్లధనంపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా నమోదైన 255 రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. కాగితాలకే పరిమితమైన ఈ పార్టీల గుర్తింపును రద్దు చేస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. 2005 నుంచి 2015 వరకు జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీలు పోటీచేయకపోవడంతో పాటు మనీ లాండరింగ్ కార్యకలాపాల్లో ఇవి పాలుపంచుకుంటున్నాయని ఈసీ భావించింది. ఈ మేరకు 255 పార్టీల గుర్తింపును రద్దు చేస్తున్నట్టు తెలిపింది. గుర్తింపు రద్దు చేసిన రాజకీయ పార్టీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అన్నాటీడీపీ, ఎన్టీఆర్ టీడీపీ, జై తెలంగాణ వంటి 15 పార్టీలు ఉన్నాయి.
డీలిస్టు చేసిన ఈ రాజకీయ పార్టీల జాబితాను ఎన్నికల సంఘం, ఆదాయపు పన్ను శాఖకు పంపించనుంది. రాజకీయ పార్టీలకు ఉన్న వెసులు బాటును అనుసరించి ఆయా పార్టీలు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటున్నాయని ఈసీ అనుమానం వ్యక్తం చేసింది. ఈ రాజకీయ పార్టీల ఆర్థిక కార్యకలాపాలపై పరిశీలన జరపాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు కూడా లేఖ రాసింది. లేఖ రాసిన రెండు రోజుల వ్యవధిలోనే ఆ పార్టీలపై చర్యలు తీసుకుంటున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.