రైతు వ్యతిరేకి.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం

రైతు వ్యతిరేకి.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం - Sakshi


హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, సహకార బ్యాంకులు రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేయడం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి. కిషన్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షులు ఎల్. రమణలు మండిపడ్డారు. మంగళవారం అబిడ్స్ రోడ్‌లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు టీడీపీ, బీజేపీ ఆధ్వర్యంలో రైతు రుణాల మంజూరులో సహకార బ్యాంకుల నిర్లక్ష్యానికి నిరసనగా ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో  1,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దీనికి కారణం టీఆర్‌ఎస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలే అని అన్నారు. రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ పార్టీ.. 25 శాతం రుణమాఫీ చేసి మిగతాది దశలవారీగా చేస్తామని ప్రకటించడం సరికాదన్నారు.  రైతులకు విడతలవారీగా కాకుండా ఒకేసారి రుణమాఫీ చేయాలని, లేనిపక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ మాట్లాడుతూ...రైతులకు సకాలంలో రుణమాఫీ చేసి రబీ సీజన్‌లో కొత్త రుణాలందించాలన్నారు. రైతులకు రూ.17వేల కోట్ల రుణాలు అందిస్తామని, కనీసం రూ.5వేల కోట్లు కూడా అందించలేకపోవడం విచారకరమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మెడలు వంచేందుకు ఉద్యమాన్ని నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ మాజీమంత్రి పెద్దిరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే, ఫ్లోర్ లీడర్ డాక్టర్ కె. లక్ష్మణ్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ఎ.గాంధీ, చింతల రాంచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, బీజేపీ గ్రేటర్ అధ్యక్షుడు బి. వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ధర్నా చేసిన వారిని పోలీసులు అరెస్ట్‌చేసి అబిడ్స్ పీఎస్‌కు తరలించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top