నోట్ల రద్దు ఎఫెక్ట్‌: ఉర్జిత్‌పై బ్యాంక్‌ ఉద్యోగుల ఫైర్‌ | Bank Employees Association demands RBI Governor resignation | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దు ఎఫెక్ట్‌: ఉర్జిత్‌ పై బ్యాంక్‌ ఉద్యోగుల ఫైర్‌

Nov 23 2016 2:06 PM | Updated on Sep 4 2017 8:55 PM

నోట్ల రద్దు ఎఫెక్ట్‌: ఉర్జిత్‌పై బ్యాంక్‌ ఉద్యోగుల ఫైర్‌

నోట్ల రద్దు ఎఫెక్ట్‌: ఉర్జిత్‌పై బ్యాంక్‌ ఉద్యోగుల ఫైర్‌

నోట్ల రద్దుతో ఏర్పడిన గందరగోళానికి, మరణాలకు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్‌ పటేల్‌ బాధ్యత వహించి రాజీనామా చెయ్యాలని బ్యాంక్‌ ఉద్యోగుల సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ముంబై: నోట్ల రద్దుపై రాజకీయ పక్షాల్లోనేకాక బ్యాంకింగ్‌ రంగంలోనూ పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుపడుతుండగా.. బ్యాంక్‌ ఉద్యోగుల సంఘాలు ఒక అడుగుముందుకేసి ఏకంగా ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామాను డిమాండ్ చేస్తున్నాయి.

నోట్ల రద్దు నిర్ణయంతో దేశంలో నెలకొన్న గందరగోళానికి బాధ్యుడు ముమ్మాటికి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్‌ పటేలేనని అఖిల భారత బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు విశ్వాస్ ఉటాగి అన్నారు. బుధవారం ముంబైలో మీడియాతో మాట్లాడుతూ ‘బ్యాంకు ముందు భారీ క్యూలైన్లలో నిల్చోలేక ఇప్పటి వరకు 50 మంది చనిపోయారు. ఒక్కసారిగా విపరీతమైన తాకిడి పెరగడంతో బ్యాంకు ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో దేశవ్యాప్తంగా 11 మంది బ్యాంక్‌ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ చావులన్నింటికీ ఆర్బీఐ గవర్నరే బాధ్యత వహించి రాజీనామా చెయ్యాలి. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆ స్థానంలో ఉన్న వ్యక్తికి తెలియదా?’అని విశ్వాస్‌ మండిపడ్డారు. (నోట్ల రద్దు ఎఫెక్ట్‌: ఉర్జిత్‌ ఔట్‌?)

మరోవైపు ఆలిండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు థామస్‌ ఫ్రాంకో కూడా ఇటీవల ఢిల్లీలో జరిగిన సదస్సులో ఆర్బీఐ గవర్నర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బ్యాంక్ ఉద్యోగుల మరణాలకు ఉర్జిత్ పటేలే బాధ్యుడని, వెంటనే పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. ‘పాత నోట్లు రద్దై రోజులు గడుస్తున్నా దేశంలోని చాలా ప్రాంతాలకు కొత్త కరెన్సీ అందుబాటులోకి రాలేదు. మరోవైపు ప్రజలు బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు, నిజానికి మొత్తం కరెన్సీలో నగదు రూపంలో ఉండే బ్లాక్‌ మనీ 6 శాతానికి మించి ఉండదు. దానిని నిర్మూలించడానికి ఏకంగా 14 లక్షల కోట్ల విలువైన కరెన్సీని రద్దుచేయడం తెలివైనపని కాదు. నోట్ల రద్దు అనంతరం తలెత్తిన పరిస్థితికి బాధ్యుడిగా ఆర్బీఐ గవర్నర్‌ రాజీనామాను కోరడంలో తప్పులేదు’ అని ఫ్రాంకో అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆర్బీఐ గవర్నర్ పై అసహనం వ్యక్తం చేసినట్లు ఇటీవల కొన్న వార్తా సంస్థలు పేర్కొనడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement