
బేబీ కిల్లర్..
పాల బాటిల్‌తో పాలు తాగుతున్న ఈ 9 నెలల బుడ్డోడు.. పోలీసు అధికారుల హత్యకు పథకం పన్నాడు! ఓయ్.. అంటూ వారిని బెదిరించాడు.
పాల బాటిల్‌తో పాలు తాగుతున్న ఈ 9 నెలల బుడ్డోడు.. పోలీసు అధికారుల హత్యకు పథకం పన్నాడు! ఓయ్.. అంటూ వారిని బెదిరించాడు.. అంతేకాదు.. సమాజశాంతికి భంగం కలిగించాడు!! ఇదంతా నిజమే.. అందుకే మహమ్మద్ మోసా ఖాన్ అనే ఈ పిల్లాడిని గురువారం కోర్టులో హాజరుపరిచారు. చిన్నారికి బెయిల్ మంజూరు చేసిన జడ్జి కేసును ఈ నెల 12కు వాయిదా వేశారు. ఈ విచిత్ర ఘటన పాకిస్థాన్‌లోని లాహోర్‌లో జరిగింది. ఇంతకీ విషయమేమిటంటే.. గ్యాస్ దొంగలను పట్టుకోవడానికి పోలీసులు మహమ్మద్ యాసీన్ అనే వ్యక్తి నివసిస్తున్న ఇంటిపై దాడి చేశారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు పోలీసు అధికారులను హత్య చేసే ఉద్దేశంతో రాళ్లు విసిరారని.. బెదిరించారని పోలీసులు వారందరిపై కేసు పెట్టారు.
వీడికా సీన్ ఉందా లేదా అన్న విషయాన్ని చూడకుండా.. ఆ కుటుంబంలో భాగమైన మోసా ఖాన్‌పైనా కేసు నమోదు చేశారు. చివరికిది మీడియాలో రావడంతో ఉన్నతాధికారులు స్పందించి.. సదరు ఘటనపై విచారణకు ఆదేశించారు. కేసు నమోదు చేసిన ఎస్సైను సస్పెండ్ చేశారు. 12న కేసు విచారణకు వచ్చినప్పుడు మోసా ఖాన్ పేరును అభియోగ పత్రం నుంచి తొలగించే అవకాశముంది.