'అంజార్' విషాదం గుర్తొచ్చింది: మోదీ | Afghan president briefs Modi on quake | Sakshi
Sakshi News home page

'అంజార్' విషాదం గుర్తొచ్చింది: మోదీ

Oct 26 2015 9:50 PM | Updated on Mar 28 2019 6:10 PM

స్కూల్ లో జరిగిన తొక్కిసలాటలో 12 మంది విద్యార్థినులు చనిపోయారని చెప్పినప్పుడైతే..నా గుండెల్లో తడి ఆరిపోయింది. ఒక్కసారిగా అంజార్ విషాదం గుర్తుకొచ్చింది' అని మోదీ అన్నారు.

న్యూఢిల్లీ: వందలాది ప్రాణాలు మట్టిలో కలిసిపోవడమేకాక తీవ్ర ఆస్తి నష్టాన్ని అఫ్ఘానిస్థాన్ కు మిగిల్చిన భారీ భూకంపంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భాంతి వ్యక్తం చేశారు. సోమవారం నాటి సంఘటనలు తనను ఎంతగానో బాధించాయని, కష్ట సమయంలో ఆఫ్ఘన్ కు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.

హిందూ ఖుష్ పర్వత శ్రేణులు కేంద్రంగా సోమవారం మధ్యాహ్నం సంభవించిన భారీ భూకంపం కారణంగా అఫ్ఘాన్ లో దాదాపు 70 మంది చనిపోగా, వేలాది మంది గాయాలపాలయ్యారు. వందల సంఖ్యలో ఇళ్లు, కట్టడాలు నేలమట్టం అయ్యాయి. విపత్తు అనంతర పరిణామాలను ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని.. నరేంద్ర మోదీకి ఫోన్ లో వివరించారు.

'ఘని చెప్పిన వివరాలు నన్నెంతో బాధించాయి. ఇలాంటివి వినాల్సిరావడం దురదృష్టకరం. స్కూల్ లో జరిగిన తొక్కిసలాటలో 12 మంది విద్యార్థినులు చనిపోయారని చెప్పినప్పుడైతే.. నా గుండెల్లో తడి ఆరిపోయింది. ఒక్కసారిగా నాకు అంజార్ విషాదం గుర్తుకొచ్చింది' అని మోదీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో చేతనైనంత సాయం అందిస్తామని ఘనికి మోదీ హామీ ఇచ్చారు. జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ తోనూ ఫోన్ లో మాట్లాడిన మోదీ.. ఆ రాష్ట్రంలో భూకంపం కలిగించిన నష్టం వివరాలను తెలుసుకున్నారు.

2001లో గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో భూకంపం సంభవించినప్పుడు అంజూర్ అనే పట్టణంలో నేటి అఫ్ఘాన్ తరహా సంఘటనే జరిగింది. కంపిస్తున్న స్కూల్ భవనం నుంచి బయటికి పరుగుతీసే క్రమంలో పదుల సంఖ్యలో విద్యార్థులు చనిపోయారు. అప్పుడు నరేంద్ర మోదీ గుజరాత్ బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. కచ్ విషాదం అనంతరం ఆయన గుజరాత్ సీఎం పగ్గాలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement