కాంగ్రెస్, బీజేపీలతో కలిసేది లేదు: ఆమ్ ఆద్మీ పార్టీ | Aam Aadmi Party rules out alliance with BJP, Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, బీజేపీలతో కలిసేది లేదు: ఆమ్ ఆద్మీ పార్టీ

Dec 9 2013 12:52 PM | Updated on Mar 29 2019 9:18 PM

తాము ఇటు బీజేపీకి గానీ, అటు కాంగ్రెస్ పార్టీకి గానీ మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీష్ సిసోదియా తెలిపారు.

ఢిల్లీలో కొత్తగా రాబోయే ప్రభుత్వం ఏది? ఈ ప్రశ్న ప్రస్తుతం అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. మిగిలిన మూడు రాష్ట్రాల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చినా, ఢిల్లీలో మాత్రం అధికారాన్ని చేపట్టడానికి ఐదు స్థానాల దూరంలోనే ఉండిపోయింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ పాత్ర ఇప్పుడు కీలకంగా మారింది. అయితే తాము మాత్రం ఇటు బీజేపీకి గానీ, అటు కాంగ్రెస్ పార్టీకి గానీ మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీష్ సిసోదియా తెలిపారు. తాము ప్రతిపక్షంలో కూర్చుంటాం లేదా మళ్లీ ఎన్నికలైనా ఎదుర్కొంటాం తప్ప ఎవరికీ మద్దతు మాత్రం ఇవ్వబోమన్నారు.

పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన కోర్ గ్రూప్ సమావేశంలో పాల్గొని వచ్చిన అనంతరం ఆయనీ విషయం తెలిపారు. పొత్తు ఉండబోదన్న విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్ ముందే చెప్పారని సిసోదియా గుర్తుచేశారు. పైపెచ్చు, అసలు ఇంతవరకు మద్దతు ఇవ్వాల్సిందిగా తమను ఏ పార్టీ కూడా సంప్రదించలేదని తెలిపారు. తాము బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని సిసోదియా చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 28 స్థానాలు సాధించిన ఆప్.. రెండో అదిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. బీజేపీకి 31 స్థానాలు మాత్రమే వచ్చాయి. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement