వైద్యుల నిర్లక్ష్యం.. ఓ కుటుంబం విషాదాంతం | 7-year-old dies of dengue, parents commit suicide | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యం.. ఓ కుటుంబం విషాదాంతం

Sep 12 2015 4:51 PM | Updated on Sep 3 2017 9:16 AM

వైద్యుల నిర్లక్ష్యం.. ఓ కుటుంబం విషాదాంతం

వైద్యుల నిర్లక్ష్యం.. ఓ కుటుంబం విషాదాంతం

ఎన్నో ఆశలతో ఒడిశా నుంచి ఢిల్లీ వెళ్లిన ఓ కుటుంబం.. వైద్యుల నిర్లక్ష్యం వల్ల విషాదాంతమైంది.

న్యూఢిల్లీ: అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకు డెంగ్యూ వ్యాధి బారినపడ్డాడు. ఈ ఏడేళ్ల చిన్నారిని చికిత్స కోసం తీసుకెళితే చేర్చుకునేందుకు ప్రైవేట్ ఆస్పత్రులు నిరాకరించాయి. కొడుకును కాపాడుకునేందుకు ఏమీ చేయలేని దయనీయ స్థితి. చికిత్స అందక ఆ చిన్నారి మరణించాడు. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు భవంతిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్నో ఆశలతో ఒడిశా నుంచి ఢిల్లీ వెళ్లిన ఓ కుటుంబం.. వైద్యుల నిర్లక్ష్యం వల్ల విషాదాంతమైంది. ఈ ఘటనను కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాయి. వైద్యం చేయడానికి నిరాకరించిన రెండు ప్రైవేట్ ఆస్పత్రులకు ఢిల్లీ సర్కార్ నోటీసులు జారీ చేసింది. వీటిపై తగిన చర్యలు తీసుకుంటామంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నద్దా ఆగ్రహం వ్యక్తం చేశారు.  


మృతులను ఒడిశాకు చెందిన లక్ష్మీచంద్ర, బబితా రౌత్గా గుర్తించారు. లక్ష్మీచంద్ర ఓ ప్రైవట్ కంపెనీలో పనిచేసేవారు. ఈ కుటుంబం లడో సరాయ్ వద్ద నివాసం ఉండేది. ఈ దంపతుల కొడుకు అవినాష్ (7)కు తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఈ నెల 7న ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ చిన్నారిని చేర్చుకునేందుకు రెండు ఆస్పత్రుల్లో నిరాకరించారు. చివరకు మరో ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే ఆలస్యం కావడంతో మరుసటి రోజున అంటే 8వ తేదీని అవినాష్ డెంగ్యూతో మరణించాడు. కుమారుడి మృతిని తట్టుకోలేకపోయిన తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని వారు ఒడియాలో సూసైడ్ నోట్ రాసిపెట్టారు. అయితే ఈ కుటుంబం బలి కావడానికి ఆస్పత్రుల యాజమాన్యాల నిర్లక్ష్యమే కారణమని విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాలు తీవ్రంగా స్పందించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement