నాన్న స్థాయికి ఎదగడమంటే సాహసమే!

rao ramesh visit arasavelli temple in srikakulam district - Sakshi

వంద సినిమాలు దాటినా ఇంకా నిత్య విద్యార్థినే..

‘సాక్షి’తో ప్రముఖ సినీ నటుడు రావు రమేష్‌

శ్రీకాకుళం, అరసవల్లి: ‘తెలుగు సినీ చరిత్రలో నాన్న రావు గోపాలరావు అంటే ఓ చరిత్ర... ఓ నిఘంటువు. ఏదో కొన్ని సినిమాల్లో బాగా నటించి ఆడేస్తే...గొప్పోళ్లం కాదు..’అంటూ ప్రముఖ విలక్షణ నటుడు రావు రమేష్‌ కుమార్‌ తనదైన శైలిలో చెప్పారు. గురువారం సాయంత్రం ఆయన అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. నాన్న రావు గోపాలరావు పేరు సినిమాతెర ఉన్నంత కాలం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కొత్త సినిమాలన్నీ ఏప్రిల్‌లో ఖరారు అవుతాయని, కళామతల్లి సేవలో తనకు పాత్ర దొరకడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

ఇటీవలే 100 సినిమాలు దాటాయని, అయినా నిత్య విద్యార్థిగానే ఇండస్ట్రీలో ఉంటానని తెలిపారు. తనకు డ్రీమ్‌ రోల్‌ అంటూ ఏమీ లేదని, విభిన్న పాత్రలేవైనా చేస్తానని చెప్పారు. ఇటీవల దువ్వాడ జగన్నాధం (డిజె) సినిమాలో రొయ్యిల నాయుడు పాత్రను, గతంలో నాన్న రావు గోపాలరావు ‘ఆ ఒక్కటీ అడక్కు..’అనే సినిమాలో పోషించిన పాత్రను పోలినట్టు నటించే ప్రయత్నం చేశానని, ఎంతో సంతృప్తి నిచ్చిందన్నారు. శ్రీకాకుళంలోనే పుట్టానని, తన తల్లి కుటుంబీకులంతా అరసవల్లిలోనే ఉన్నారని చెప్పారు.  ప్రస్తుతం తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందుకే శ్రీసూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు వచ్చానని తెలిపారు. అనంతరం బ్రాహ్మణ వీధిలో ఉన్న మేనమామ కుమారుడు మండా శుకుడు అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన్ను పరామర్శించారు. 

నీలమణిదుర్గ సేవలో..
పాతపట్నం: పాతపట్నంలో కొలువైన  శ్రీనీలమణిదుర్గ అమ్మవారిని నటుడు రావు రమేష్‌ గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ మర్యాదలతో పూజలు నిర్వహించి ఆశీర్వాదాలను అందజేశారు.

Read latest Tollywood News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top