తుడా చైర్మన్‌గా చెవిరెడ్డి నియామకం

Chevi Reddy Appointed As Tuda Chairman - Sakshi

ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

మూడేళ్ల కాలపరిమితి 

పల్లెల్లో సీసీ రోడ్లు వేయించిన ఘనత ఆయనదే

సాక్షి, తిరుపతి తుడా: తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) చైర్మన్‌గా చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమిస్తూ ఈనెల 8న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శ్యామలారావు ఉత్తర్వులు జారీచేశారు. జీవో నంబర్‌ 198 ద్వారా ఈ ఉత్తర్వులు బుధవారం వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మంచిరోజు చూసుకుని తుడా చైర్మన్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. చెవిరెడ్డిని ఇప్పటికే ప్రభుత్వ విప్‌గా నియమించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో తొలి నామినేటెడ్‌ పదవిని ఆయనకే కట్టబెట్టారు. మూడేళ్ల కాల వ్యవధితో నియమితులైన ఆయన 2022 మే వరకు తుడా చైర్మన్‌గా కొనసాగనున్నారు. దీంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు.

అభివృద్ధిలో చెవిరెడ్డి మార్కు
తుడా చైర్మన్‌గా అభివృద్ధిని ఇలా కూడా చేయించవచ్చని ఇద్దరంటే ఇద్దరే నిరూపించారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రాజకీయ గురువైన భూమన కరుణాకర్‌రెడ్డి తుడాను అభివృద్ధి బాట పట్టిం చారు. అనంతరం ఆ పదవిని చేపట్టిన చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అభివృద్ధిలో తన మార్కు పాలన చేశారు. పట్టణం నుంచి పల్లె వరకు సీసీ రోడ్లు వేయించిన ఘనత ఆయనకే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ముఖ్యంగా కనీస అవసరాలకు నోచుకోని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి రికార్డు సృష్టించారు. సీసీ రోడ్లు, కాలువలు, పచ్చదనంతో పల్లెల రూపు రేఖలు మార్చేశారు. 2007లోనే 2020 విజన్‌ పేరుతో అభివృద్ధికి ప్రణాళికలు రచించారు. ప్రతి మండలానికీ సుమారు 100 సీసీ రోడ్లు వేయించారు.

గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు జన్మనిచ్చిన నారావారిపల్లి సొంత గ్రామాన్ని పట్టించుకోకపోవడంతో స్థానికుల అభ్యర్థన మేరకు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఆ గ్రామానికి సీసీ రోడ్లు వేయిం చారు. ఇలా కుల, మత, ప్రాంత తారతమ్యాలు లేకుండా ఆయన తుడా పరిధిలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి చేపట్టారు. పలు చెరువుల అభివృద్ధి, పచ్చదనం పెంపునకు ప్రాధాన్యత ఇచ్చారు. ఐదు మండలాల్లోని ప్రతి గ్రామంలో మహిళా భవనాలను నిర్మించి మహిళా సాధికారితకు కృషి చేశారు. ఎమ్మార్‌పల్లి–మహిళా వర్సిటీ, ఉప్పరపల్లి, రేణిగుంట జంక్షన్, కరకంబాడి వంటి అనేక ప్రధాన రోడ్ల విస్తరణ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హయాంలో చేపట్టినవే. తుడా కార్యాలయాన్ని కార్పొరేట్‌ హంగులతో ఆధునికీకరించారు. తుడా సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

తుడా విస్తరణ
తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట నాలుగు మండలాల పరిధికే పరిమితం అయిన తుడాను 9 మండలాలకు విస్తరించిన ఘనత చెవిరెడ్డికే దక్కుతుంది. ఆ నాలుగు మండలాలతో పాటు రామచంద్రాపురం, శ్రీకాళహస్తి, ఏర్పేడు, వడమాలపేట, పుత్తూ రు మండలాలను తుడాకు విలీనం చేసి విస్తరించారు. విస్తరించిన మండలాల్లోని గ్రామాలను సైతం అభివృద్ధి చేశారు.   

ఇప్పటి వరకు పనిచేసిన తుడా చైర్మన్లు
వి.వెంకటమునిరెడ్డి 1982–83
ఎం.వెంకట్రామానాయుడు 1984–85
ఎం.మోహన్‌ 1986–87
ఎస్‌.మునిరామయ్య 1988–89
కోలా రాము 1989–90
డాక్టర్‌ ఆర్‌.రాజశేఖర్‌రెడ్డి 1992–94
ఎల్‌బీ ప్రభాకర్‌ 1995–95
కందాటి శంకర్‌రెడ్డి 1998–99
ఎన్‌వీ ప్రసాద్‌ 2003–04
భూమన కరుణాకరరెడ్డి 2004–06
డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి 2007–10
ఎం.వెంకటరమణ 2013–15
ఎన్‌.నరసింహయాదవ్‌ 2017–19   

Read latest Chittoor News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top