
సాక్షి, హైదరాబాద్: ప్రాదేశిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ మొదలుకానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో లెక్కింపు ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మొత్తం 536 స్ట్రాంగ్ రూంల్లో భద్రపర్చిన బ్యాలెట్ బాక్స్‌లను నిర్ధేశించిన లెక్కింపు కేంద్రాలకు తీసుకువచ్చి ఓట్లను లెక్కించనున్నారు. పరిషత్ కౌంటింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 123 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రం లో 3 విడతల్లో మొత్తం 5,817 ఎంపీటీసీ స్థానాలు, 538 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేయగా... దీనిలో 4 జెడ్పీటీసీలు, 158 ఎంపీటీసీలు ఏకగ్రీవం కావడం తో.. 534 జెడ్పీటీసీ, 5659 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు.
మొత్తం 1,56,02,845 మంది ఓటర్లు ఉండగా... పరిషత్ ఎన్నికల్లో 1,20,86,385 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల పరిషత్ ఎన్నికల పోలిం గ్‌లో 77.46 శాతం పోలింగ్ జరిగింది. గత నెల 6, 10, 14 తేదీల్లో జరిగిన ఈ ఎన్నికల లెక్కింపును అదే నెల 27న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తొలుత నిర్ణయం తీసుకున్నా ఆ తర్వాత రేపటికి వాయిదా వేసింది. జిల్లా పరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికకు దాదాపు 42 రోజుల సమయం ఉండటం, క్యాంపులతో ప్రలోభాలకు గురి చేసే అవకాశాలున్నాయనే ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ఈ నెల 8న, మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక ఈ నెల 7న నిర్వహించేందుకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్, షెడ్యూల్ జారీ చేసింది.
కౌంటింగ్ జరుగుతుందిలా...
రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 123 కౌంటింగ్ కేంద్రాల్లో మంగళవారం ఉదయం పోలింగ్ కేంద్రాల వారీగా బ్యాలెట్ పేపర్లు, సదరు బూత్‌లో ఉన్న ఓటర్ల వివరాలతో లెక్కించనున్నారు. ఆ తర్వాత వీటిని బండిల్ చేసిన అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా విడదీసి ఒక్కో బండిల్‌లో 25 బ్యాలెట్ పత్రాలు చుట్టనున్నారు. రెండో దశలో ఎంపీటీసీ ఎన్నికకు కౌంటింగ్ మొదలుపెడతారు. ఒక్కో ఎంపీటీసీ స్థానానికి రెండు టేబుళ్లు రెండు రౌండ్లు ఏర్పాటు చేశారు. ప్రతీ ఎంపీటీసీ అభ్యర్థి ఇద్దరు కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాలని ఇప్పటికే అభ్యర్థులకు సూచించారు. ప్రతి బ్యాలెట్ పేపర్‌ను ఓపెన్ చేసి చెల్లుబాటు అవుతుందా లేదా అనేది ఏజెంట్ల ముందు చూడనున్నారు.
చెల్లుబాటు అయితే ఎంపీటీసీ స్థానాల్లోని ట్రేల్లో వేయనుండగా... అనుమానాలు వ్యక్తం చేస్తే మాత్రం రిటర్నింగ్ అధికారుల దగ్గరకు పంపించి, నిర్ణయం తీసుకుంటారు. అభ్యంతరాలున్న బ్యాలెట్లపై రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయం ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం లెక్కింపు మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ముందుగా ఎంపీటీసీ స్థానాల్లో ఓట్లను లెక్కించి, ఆ తర్వాత జెడ్పీటీసీ ఓట్లను లెక్కించేలా ఏర్పాట్లు చేశారు. ఒక రౌండ్‌లో వెయ్యి ఓట్లు లెక్కించనుండగా... ఒక్కో స్థానానికి రెండు రౌండ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 978 కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేయగా... 11,882 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 23,647 మంది కౌంటింగ్ అసిస్టెంట్లతో కలుపుకుని మొత్తం 35,529 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించారు. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు లెక్కింపు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
మధ్యాహ్నం నుంచే ఫలితాల ట్రెండ్..
పరిషత్ ఓట్ల లెక్కింపు సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం నుంచే ఫలితాలపై ఒక అంచనా రానున్నట్లు రాజకీయ పార్టీలు పేర్కొంటున్నాయి. కట్టలు కట్టిన అనంతరం లెక్కింపు చేయనుండగా... ఐదారు రౌండ్లలోనే ఫలితాలు తేలనున్నట్లు భావిస్తున్నారు. లెక్కింపు సందర్భంగా కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రత చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో మద్యం దుకాణా లు మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలిచ్చారు.