
'మత్తయ్యకు షెల్టర్ ఇచ్చినవారిపై చర్యలు తీసుకోవాలి'
ఓటుకు కోట్ల వ్యవహారంలో తన ప్రమేయం లేదని, స్టీఫెన్‌సన్‌తో తాను మాట్లాడలేదని, టేపుల్లో ఉన్నది తన గొంతు కాదని...
* ‘ఓటుకు కోట్ల’ ఉదంతంపై చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ సూటిప్రశ్న
* బాబుది నేరమే: పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి ఆకుల మూర్తి
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్ల వ్యవహారంలో తన ప్రమేయం లేదని, స్టీఫెన్‌సన్‌తో తాను మాట్లాడలేదని, టేపుల్లో ఉన్నది తన గొంతు కాదని ఏపీ సీఎం చంద్రబాబు ఎందుకు చెప్పట్లేదని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధికార ప్రతినిధి ఆకుల మూర్తి ప్రశ్నించారు. చంద్రబాబు నేరం చేశారన్నది పక్కా నిజమని, ఆయన ఇకనైనా ఈ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం మాని ఏపీ అభివృద్ధిని కోరుకుంటే సీఎం పదవికి రాజీనామా చేసి దర్యాప్తునకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు.
దిగజారిన రాజకీయ విలువలకు ప్రతీకగా నిలిచిన ఈ వ్యవహారంలో ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని వమ్ము చేసినందుకు చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించి సత్తా చాటుకుని మెజారిటీ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యవహారమంతా వీడియో, ఆడియో టేపుల రూపంలో ప్రజల కళ్లెదుట కనిపిస్తుంటే దీని వెనక సీఎం కేసీఆర్, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలసి కుట్ర పన్నారని టీడీపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, వైఎస్సార్‌సీపీని, వైఎస్ జగన్‌ని విమర్శించే హక్కు టీడీపీకి లేదన్నారు.
మత్తయ్య వెనుక ఎవరున్నారు, ఆయనకు ఆశ్రయం ఎవరిచ్చారనే అంశాలతోపాటు ముడుపుల వ్యవహారంలో ఆయన పాత్రపై ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కాగా, తెలంగాణలోని ప్రాజెక్టులను జగన్ వ్యతిరేకించలేదని, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన అనుమతులు, నీటి లభ్యతకు అనుగుణంగానే ప్రాజెక్టులు కట్టాలని, ఏ ప్రాజెక్టు కట్టినా సక్రమంగా ఉండాలని మాత్రమే చెప్పారన్నారు.