
టిక్‌టాక్ సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. చంపాపేట డివిజన్ కటకోని కుంట కాలనీకి చెందిన రాజు, గీత దంపతుల కుమారుడు పవన్ (20). పవన్‌కు టిక్‌టాక్ వీడియోలు చేయడం అంటే ఇష్టం. స్నేహితులతో కలసి యాక్షన్ సినిమాలలో మాదిరిగా తరచూ టిక్‌టాక్‌లు చేస్తుండేవాడు. భద్రాచలం అనే సినిమాలో నదిలో కొట్టుకుపోతున్న పొట్టేలును హీరో శ్రీహరి కాపాడిన సన్నివేశం మాదిరి టిక్‌టాక్‌లో చిత్రీకరించాలని అనుకున్నాడు.
వీడియోను చిత్రీకరించేందుకు స్నేహితులతో కలసి ఆదివారం అల్మాస్‌గూడలోని రాజీవ్ గృహకల్ప సమీపంలోని చెరువు వద్దకు వెళ్లాడు. ఈత రాని పవన్ పొట్టేలును ఎత్తుకుని చెరువులోకి దిగాడు. ఒక్కసారిగా గుంతలోకి జారడంతో నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందాడు. పవన్ స్నేహితుడు ఏసు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరిన పోలీసులు.. పవన్ మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. పవన్ మృతితో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
– చంపాపేట