మార్చి 3 లేదా 13..

Yadadri Garbhalayam early dates were finalized by the Jeevaswamy - Sakshi

యాదాద్రి గర్భాలయం ప్రారంభ తేదీలు ఖరారు చేసిన చిన జీయర్‌స్వామి

జనవరి మొదటివారంలో యాదాద్రికి సీఎం కేసీఆర్‌? 

పనుల్లో వేగం పెంచిన అధికారులు

యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి నూతన గర్భాలయాన్ని మార్చి 3 లేదా 13 తేదీల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్‌స్వామి తేదీలను ఖరారు చేసినట్లు స్తపతి సుందరరాజన్‌ తెలిపారు. ఆలయ ప్రారంభ తేదీ ఖరారు కావడంతో నిర్మాణ పనుల్లో అధికారులు వేగం పెంచారు. ఇప్పటికే సప్త రాజగోపురాలతో పాటు ధ్వజస్తంభ పీఠం, బలిహరణ పీఠం దాదాపు పూర్తయ్యాయి. గర్భాలయంలో ఫ్లోరింగ్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయి. జనవరి 15లోపు గర్భాలయం పూర్తిస్థాయిలో నిర్మితం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆలయ మాడవీధులు, రాజగోపురాల మధ్య లో అతికించేందుకు శిల్పాలు త్వరలో రానున్నాయి.
 
జనవరిలో రానున్న సీఎం కేసీఆర్‌... 
పనులు జరుగుతున్న తీరును పరిశీలించేందుకు జనవరి మొదటి వారంలో సీఎం కేసీఆర్‌ యాదాద్రికి రానున్నట్లు సమాచారం. త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నందున కోడ్‌ అమల్లోకి రాకముందే సీఎం పర్యటన ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గర్భాలయ ప్రారంభానికి మార్చిలో తేదీలను ఖరారు చేసిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ యాదాద్రి పనులను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం చిన జీయర్‌స్వామి ఖరారు చేసిన తేదీలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈసారి సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ లాంఛనాలతో స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించే సుందరఘట్టం నూతన గర్భాలయంలోనే జరగనుంది.  

ముగిసిన అధ్యయనోత్సవాలు.. 
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆరు రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిశాయి. చివరిరోజు స్వామివారిని ముస్తాబు చేసిన శ్రీలక్ష్మీనరసింహుడి అలంకరణతో అధ్యయనోత్సవాలు ముగిశాయి. సుమారు 25 వేల మంది భక్తులు స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానికి ఐదు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top