కులాలు తారుమారు!

Wrong Details Noticed In Caste Survey At Peddapalli District - Sakshi

సాక్షి, కోల్‌సిటీ/జ్యోతినగర్‌(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రక్రియ కోసం అధికారులు చేపట్టిన కుల గణన సర్వేలో మళ్లీ తప్పులుదొర్లాయి. సోమవారం అధికారులు ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రదర్శనకు పెట్టారు. జాబితాలో డివిజన్ల వారీగా ఫొటో ఓటర్ల జాబితాను సామాజిక వర్గాలవారీగా ప్రదర్శనకు పెట్టారు. మంగళవారం జాబితాను పరిశీలించిన పలువురు ఖంగుతిన్నారు. ఓటర్ల కులాలను తప్పులతడకగా నమోదు చేసిన అధికారుల నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా డివిజన్లలో సామాజిక వర్గాలను గుర్తించడానికి అధికారులు మొక్కుబడిగా సర్వే చేపట్టారని పలువురు ఆరోపిస్తున్నారు.

ఒక సామాజిక కులానికి చెందిన వ్యక్తిని, మరో సామాజిక కులం వ్యక్తిగా తప్పుగా నిర్ధారిస్తూ ఓటర్ల ముసాయిదా జాబితాలో పొందుపర్చడం గమనార్హం. గత జూలైలో కూడా అధికారులు ఓటర్ల సామాజిక వర్గాలను గుర్తించడంలో తప్పులు దొర్లాయని ఆయా సామాజిక వర్గాలకు వారు ఫిర్యాదులు చేశారు. వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి కొత్త జాబితా రూపొందించినట్లు చెబుతున్న అధికారులు, సోమవారం విడుదల చేసిన ఓటర్ల ముసాయిదాలో కూడా తప్పులు దొర్లడంతో చర్చనీయాశంగా మారింది. అధికారులు, సిబ్బంది ఇంటింటికీ తిరిగి సర్వే చేయకుండా... ఒకే దగ్గర కూర్చొని తప్పులతడకగా జాబితా తయారు చేశారని పలువురు ఆరోపిస్తున్నారు.

సామాజిక వర్గాల గుర్తింపులో అయోమయం...
ఓటర్ల సామాజిక వర్గాల గుర్తింపులో అయోమయం, గందరగోళం నెలకొంది. పలు డివిజన్‌కు చెందిన బీసీలను ఎస్సీలు, ఎస్టీలుగా నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. బీసీ సామాజిక వర్గానికి ఓల్లాది ఓదెలు అనే వ్యక్తితోపాటు అతని కుటుంబ సభ్యులను ఎస్టీ సామాజిక వర్గంగా, బీసీ సామాజిక వర్గానికి చెందిన బత్తుల భరత్‌ అనే యువకునితోపాటు అతని కుటుంబ సభ్యులను ఎస్సీలుగా జాబితాలో పొందుపరిచారు. మరో ఓసీ సామాజికవర్గానికి చెందిన కుటుంబ సభ్యులను బీసీలుగా, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలను బీసీలుగా మార్చారు. ఒకే కుటుంబంలో ఒకరిని బీసీలుగా, ఇంకొకరిని ఎస్సీలు జాబితాలో పొందుపరిచారు.

హిందూ పేరుతో ఓటర్లు!
కొత్తగా ఏర్పడిన మూడో డివిజన్‌లోని ఓటరు ఐడీ నంబర్లు ఆర్‌కేకే2238285, ఆర్‌కేకే2240877, ఆర్‌కేకే2247336, ఆర్‌కేకే2240836 ఐడీలలో ఓటరు పేరు ముద్రితం కాకుండా హిందూ హిందూ అని ముద్రితమైంది. ఒకే ఇంటి నంబరులో ఉన్న ఇద్దరు ఓటర్లకు మూడేసి ఓట్లు ఉన్నట్లు వాటికి మూడు రకాల ఐడీ నంబర్లు సైతం ఉన్నాయి. దీంతో ఓటరు జాబితాను తయారు చేసిన తీరుపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటి ఓటరు సర్వే చేసిన వారు ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరికి మూడు ఓట్లు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఓటరు తుది జాబితా వచ్చే లోపు సవరణలు చేపట్టి కచ్చితమైన ఓటరు జాబితాను తయారు చేయాలని పలువురు కోరుతున్నారు..

పురుషులు.. మహిళలుగా..
కోల్‌సిటీ(రామగుండం): ఈ ఓటరు స్లిప్‌పై పేరున్న వ్యక్తి కానుగంటి శ్రీనివాస్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. గోదావరిఖనిలో ఉంటాడు. ఇతని పేరు, ఫొటోను చూసి కూడా పురుషుడు అని గుర్తించని ఉద్యోగులు ఓటరు జాబితాలో మహిళగా తప్పుగా నమోదు చేశారు. ఇలా మహిళలను పురుషులుగా గుర్తిస్తూ ఓటరు జాబితాలో పొందుపరిచారు. రామగుండం కార్పొరేషన్‌లో సోమవారం విడుదల చేసిన ముసాయిదాలో చాలా మంది ఓటర్ల వివరాల నమోదులో తప్పులు దొర్లాయి. మహిళలను పురుషులుగా నమోదు చేసిన అధికారులు, పురుషులను మహిళలుగా గుర్తించారు. కొందరు ఓటర్ల పేర్లు, వారి తల్లిదండ్రుల పేర్లను హిందూ అని నమోదు చేశారు. దీంతో ఓటరు జాబితా ఆధారంగా డివిజన్లలో మహిళలు, పురుషుల సంఖ్యను లెక్కించడంలో తేడాలు ఏర్పడే సమస్యలు ఉన్నాయి. మంగళవారం వీటిని గుర్తించిన బల్దియా అధికారులు, మరోసారి జాబితాను క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. పురుషుల పేర్లు, ఫొటోలను చూసి కూడా ఆడవాళ్లను మగవాళ్లుగా, పురుషులను మహిళలుగా ఓటరుగా నమోదు చేయడం విడ్డూరంగా ఉంది.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top