శబరిమలకు వెళ్లిన ఓ భక్తుడు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు.
పట్టించుకోని కేరళ ప్రభుత్వం
భాష రాకపోవడంతో ఇబ్బందులకు గురైన సహచరులు
నాగోలు: శబరిమలకు వెళ్లిన ఓ భక్తుడు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు. అతడిని నగరానికి తీసుకొచ్చేందుకు సహచరులు అష్టకష్టాలుపడ్డారు. వివరాలు.. హయత్‌నగర్ మండలం పెద్దఅంబర్‌పేటకు చెందిన భీమగాని సోషలిజం అలియాస్ వెంకటేష్‌గౌడ్ ఆటోనగర్‌లో రేడియం ఆర్టిస్ట్. ఈనెల 9న అయ్యప్ప స్వాములతో కలిసి శబరిమల వెళ్లాడు. 11న ఉదయం పంబానదిలో స్నానం చేసి అయ్యప్ప దర్శనానికి వెళ్తుండగా వెంకటేష్‌గౌడ్‌కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే సహచరులు అతడిని కొట్టాయం గాంధీనగర్‌లోని మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు.
అక్కడి భాష రాక.. డాక్టర్లు చెప్పేది అర్థం కాకవారు ఇబ్బందులుపడ్డారు. కొట్టాయం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఆస్పత్రి వర్గాలు సరైన చికిత్సను అందించలేకపోయాయి. మరోవైపు వెంకటేష్‌గౌడ్ కుటుంబీకులకు కేరళ వెళ్లే వీలు లేకపోవడం వారు మానసిక వేదనకు గురయ్యారు. అతడిని నగరానికి తీసుకొచ్చేందుకు శతవిధాల ప్రయత్నించారు. కొచ్చిన్ నుంచి విమానంలో తీసుకొద్దామని టికెట్ బుక్ చేసినా ఫలితం లేదు. చివరికి అంబులెన్స్‌లో నగరానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు.