ప్రాణం తీసిన ఈ–పాస్‌

Woman who went for ration and lost her life - Sakshi

రేషన్‌ కోసం వెళ్లి ప్రాణం పోగొట్టుకున్న మహిళ

ప్రమాదవశాత్తు బిల్డింగ్‌పై నుంచి పడి మృతి

కడెం(ఖానాపూర్‌) : రేషన్‌ సరుకుల్లో అవకతకలను నిరోధించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ–పాస్‌ విధానం ఓ మహిళ ప్రాణాలు బలిగొంది. కడెం మండలం గంగాపూర్‌ గ్రామం నాయకపుగూడకు చెందిన ఏదుల లస్మవ్వ(45) రేషన్‌ సరుకుల కోసం వెళ్లి మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు బిల్డింగ్‌పై నుంచి పడి మృతి చెందింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–పాస్‌ యంత్రాలు 4జీ నెట్‌వర్క్‌తోనే పని చేస్తాయి. కానీ మారుమూల గ్రామమైన గంగాపూర్‌లో సిగ్నల్స్‌ సరిగ్గా రావు. దీంతో డీలర్‌ వినియోగదారుల వేలిముద్రలు తీసుకునేందుకు బంగ్లాపైన సిగ్నల్స్‌ రావడంతో అక్కడ ఈ పాస్‌ యంత్రం ద్వారా వేలిముద్రలు తీసుకుంటూ, సరుకులు అందజేస్తున్నాడు. మంగళవారం రాత్రి ఏదుల లస్మవ్వ రేషన్‌ సరుకుల కోసం బంగ్లాపైకి వెళ్లి తిరిగి దిగే సమయంలో మెట్లపై నుంచి(మెట్లకు పక్కన గోడలు లేవు) పడి తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గొర్ల ఆజయ్‌బాబు తెలిపారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు
బుధవారం ఘటనా స్థలాన్ని జిల్లా పౌరసరాఫరాల శాఖ అధికారి సుదర్శన్, తహసీల్దార్‌ నర్సయ్య, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ రహీమొద్దీన్‌ సందర్శించి వివరాలను తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన కొందరు భాధితురాలి కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేయగా అపద్బంధు పథకం కింద ఆర్థిక సహాయం అందజేస్తామని తహసీల్దార్‌ తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top