చేవెళ్లలో మహిళ దారుణ హత్య | woman brutal murder in Chevella | Sakshi
Sakshi News home page

చేవెళ్లలో మహిళ దారుణ హత్య

Mar 11 2015 11:54 PM | Updated on Mar 28 2018 11:08 AM

చేవెళ్ల మండల కేంద్రంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఒంటరిగా ఉంటున్న ఆమెను గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి చంపేశారు.

- గొంతు కోసి చంపిన దుండగులు
- వివరాలు సేకరించిన పోలీసులు

చేవెళ్ల రూరల్: చేవెళ్ల మండల కేంద్రంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఒంటరిగా ఉంటున్న ఆమెను గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి చంపేశారు. ఈ సంఘటన బుధవారం వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఆలూరు గ్రామానికి చెందిన నయికుడి రాంచంద్రయ్య, అంజమ్మ దంపతుల కూతురు తులసి(25)ని కొన్నేళ్ల క్రితం యాప్రాల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు.

ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె భర్తను వదిలేసి ఐదు సంవత్సరాల క్రితం పుట్టింటికి వచ్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తులసి ఆరు నెలలుగా చేవెళ్ల మండలకేంద్రంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. తల్లిదండ్రులు తరచూ ఆమె వద్దకు వచ్చి వెళ్తుండేవారు. మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రించిన తులసి బుధవారం ఉదయం బయటకు రాలేదు. తలుపులు మూసి ఉన్నాయి. మధ్యాహ్నం సమయంలో నల్లానీళ్లు రావడంతో పట్టుకోమని పొరుగువారు కేకలు వేసినా తులసి నుంచి స్పందన లేకుండాపోయింది.

స్థానికులు వెళ్లి చూడగా తలుపులు తీసి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా మంచంపై విగతజీవిగా పడి ఉంది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ రాజశేఖర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. తులసి గొంతుపై కోసిన ఆనవాళ్లను గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఆమెకు తెలిసిన వ్యక్తులే  ఇంట్లోకి వచ్చి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. హతురాలి తల్లి అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement