అమ్మతనానికి అడ్డు‘కోత’ | without need for Operations | Sakshi
Sakshi News home page

అమ్మతనానికి అడ్డు‘కోత’

May 21 2016 2:47 AM | Updated on Sep 4 2017 12:32 AM

అమ్మతనానికి అడ్డు‘కోత’

అమ్మతనానికి అడ్డు‘కోత’

జిల్లాలోని దాదాపు 90 శాతం ప్రభుత్వాస్పత్రులు, 24 గంటల పీహెచ్‌సీలు, కమ్యూనిటీహెల్త్ సెంటర్లలో ఇదే పరిస్థితి.

నకిరేకల్ పట్టణానికి చెందిన ప్రసన్న గత నెల 26వ తేదీన ప్రసవం కోసం స్థానిక ఏరియాస్పత్రికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆస్పత్రిలో చేర్చుకున్నారు. తీరా అక్కడ పనిచేస్తున్న ఓ ప్రైవేట్ క్లినిక్ మధ్యవర్తి కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని..ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లమని సలహా ఇచ్చినట్లు తెలిసింది. ఆమె సూచించిన ఆస్పత్రికి వెళ్లగా.. అవసరం లేకున్నా ప్రసన్నకు సిజేరియన్ చేశారు. రూ.21 వేల బిల్లు చేతికిచ్చారు.
 
* అవసరం లేకున్నా ఆపరేషన్లు
* ఏటా ఏడు వేలకుపైగా సిజేరియన్లు
* పెరుగుతున్న మాత,శిశు మరణాలు
* ప్రైవేట్ ఆస్పత్రులకు కాసుల వర్షం

సూర్యాపేట : జిల్లాలోని దాదాపు 90 శాతం ప్రభుత్వాస్పత్రులు, 24 గంటల పీహెచ్‌సీలు, కమ్యూనిటీహెల్త్ సెంటర్లలో ఇదే పరిస్థితి. గర్భిణులకు శస్త్ర చికిత్సల పేరిట కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి.

ప్రభుత్వపరంగా అందజేయాల్సిన ‘జాతీయ ఆరోగ్య గ్రామీణ మిషన్’లో వైద్య సేవలు అంతంత మాత్రంగా ఉండడంతో తప్పనిసరి  పరిస్థితుల్లో గర్భిణులు ప్రైవేటు వైద్యసేవల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. మాత, శిశు మరణాలను తగ్గించడానికి ఏటా రూ.కోట్లలో నిధులు విడదలవుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలకు చైతన్యం కల్పించి ప్రభుత్వ ఆస్పత్రులకు రప్పించడంలో యంత్రాంగం విఫలమవుతోంది. దీనిని ఆసరాగా చేసుకుని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు గర్భిణుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎలాంటి అవసరం లేకున్నా సిజేరియన్ ఆపరేషన్లు చేసి అమ్మతనాన్ని తెలిపే పురిటినొప్పులను చెరిపేస్తున్నారు.
 
ధరలు ఏవీ..?
ప్రైవేట్ ఆస్పత్రులపై జిల్లా యంత్రాంగం పర్యవేక్షణ లేకపోవడంతో పరిస్థితి ఇష్టానుసారంగా తయారైంది. రక్తం గ్రూపు తెలుసుకోవడం నుంచి పెద్దస్థాయి శస్త్ర చికిత్సల వరకు ఏయే సేవలకు ఎంత రుసుం చెల్లించాలనే వివరాలు జిల్లాలో ఏ ఒక్క ప్రైవేట్ ఆస్పత్రిలో కన్పించడం లేదు. ఫలితంగా కాసులకు కక్కుర్తి పడి కాన్పుల కోసం వచ్చే గర్భిణులకు సిజేరియన్లు చేయడానికే కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు వెలిశాయంటే జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కొన్ని చోట్ల అనుభవం లేని వైద్యులు ఆపరేషన్లు చేస్తుండడంతో అవి వికటించి మాత,శిశు మరణాలు సైతం పెరుగుతున్నాయి. జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు ఎటా సగటున 7500 మంది స్త్రీలకు సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సగటున ఏడాదికి 3 వేల సిజేరియన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులకు పోటీగా రెట్టింపు సంఖ్యలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్లు చేయడం విస్మయానికి గురిచేస్తోంది.
 
చివ్వెంల మండలం పాశ్చ్యానాయక్‌తండాకు చెందిన బుజ్జికి  నెలలు పూర్తిగా నిండడంతో స్థానిక పీహెచ్‌సీకి కాన్పుకోసం వెళ్లింది. పరిస్థితి విషమించిందని, ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి సిబ్బంది సూచించారు. ఆటోలో వెళ్తుండగానే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement