ప్రియుడిపై మోజుతోనే..

Wife Killed Husband,Due To Illegal Affair With Other Person - Sakshi

భర్తను అంతమొందించిన భార్య

గొంతు పిసికి..సుత్తెతో మోది ఘాతుకం

సాక్షి, నల్లగొండ క్రైం: నల్లగొండ పట్టణంలోని చైతన్యపురి కాలనీలో రియల్టర్‌ సోమకేశవులు హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కారణంతోనే కట్టుకున్న భార్యే తన ప్రియుడు, మరో ముగ్గురితో కలిసి ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్యోదంతంలో భాగస్వాములైన ఐదుగురు నిందితులను ప్రవేశపెట్టి జిల్లా ఇన్‌చార్జ్‌ ఎస్పీ వెంకటేశ్వర్లు కేసు వివరాలు వెల్లడించారు.

పట్టణంలోని చైతన్యపురిలో నివాసముంటున్న రియల్టర్‌ సోమ కేశవులు భార్య స్వాతితో శాంతినగర్‌కు చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి(సీసీ కెమెరాల ఏర్పాటు) దుబ్బ ప్రదీప్‌తో మూడేళ్ల నుంచి వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం రెండు నెలల క్రితం భర్తకు తెలియడంతో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. తరచుగా ఫోన్‌లో మాట్లాడడం, వాట్సప్‌లో ఫొటోలు ఉండడంతో ఇద్దరి మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో స్వాతి తన భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. అందుకు రూ.2లక్షలు ఇస్తానని స్వాతి ప్రియుడికి చెప్పింది. 

హత్య చేసింది ఇలా...
ప్రియుడు దుబ్బ ప్రదీప్‌ సోమ కేశవులును హత్య చేసేందుకు బొట్టుగూడలో ప్రింటర్‌గా పనిచేస్తున్న కొడిదేటి శివకుమార్‌ను సంప్రదించాడు. స్వాతితో తనకున్న సంబంధాన్ని వివరించాడు. స్వాతి భర్త అడ్డు తొలగించాలని చెప్పడంతో హత్యకు ప్లాన్‌ వేశారు. కొడిదేటి శివకుమార్‌ మర్రిగూడ మండలంలోని వెంకపల్లి గ్రామానికి చెందిన కంబం ప్రసాద్, బొట్టుగూడకు చెందిన ఆటోడ్రైవర్‌ చింతపల్లి నగేశ్, ప్రదీప్‌ అందరూ కలిసి ప్రదీప్‌ కొత్తగా నిర్మిస్తున్న ఇంటిపై ఈ నెల 1న మద్యం సేవించారు. కేశవులును హత్య చేసేందుకు రాత్రి 10గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నారు. అప్పటికే స్వాతి ఇద్దరు పిల్లలకు కూల్‌డ్రింక్‌లో నిద్ర మాత్రలు కలిపి తాగించింది. కాగా, కేశవులు ఇంకా నిద్రపోలేదని, నిర్ధారించుకొని మళ్లీ వెళ్లి మద్యం తాగారు.

కేశవులు భార్య స్వాతి హాల్‌లో పడుకున్నాడని ప్రదీప్‌కు ఫోన్‌ చేసి చెప్పింది. వెంటనే గ్లామర్‌ బైక్‌పై సుత్తె, టవల్‌ తీసుకొని వచ్చారు. ఇంటి వెనుక గేట్‌ నుంచి చిన్నపిల్లల గది ద్వారా హాల్‌లోకి వచ్చారు. ప్రియుడు ప్రదీప్‌ ఒక్కసారిగా సోమకేశవులు మెడకు టవల్‌ గుంజి కట్టాడు. ఊపిరి ఆడకుండా  చేశాడు. కొడిదేటి శివకుమార్‌ సుత్తెతో తలపై కొట్టబోగా సుత్తెకామ ఊసి పడింది. కంబం ప్రసాద్‌ కేశవులు కాళ్లు  కదలకుండా పట్టుకున్నారు. ఊడిపోయిన సుత్తెను తీసుకున్న శివకుమార్‌ ఛాతిపై గట్టిగా కొట్టాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత దుబ్బ ప్రదీప్, శివకుమార్, ప్రసాద్‌ కలిసి కేశవులు మృతదేహాన్ని వరండాలో ఉంచారు. ఎవరో డబ్బుల గురించి చంపి పోయారని అనుకునే విధంగా కారం తెచ్చి చల్లారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు స్వాతి బెడ్‌రూం బయటినుంచి గడియ పెట్టి అక్కడి నుంచి పారిపోయారు. 

ఇలా చిక్కారు...
 స్వాతి, ప్రదీప్‌లకు మధ్య వివాహేతర సంబంధం విషయం తెలుసుకున్న పోలీసులు వారి ఫోన్‌కాల్‌ డేటాను  పరిశీలించారు. ఇద్దరూ అనేక సార్లు మాట్లాడుకున్నట్లు నమోదైంది. దీంతో సోమ కేశవులు దహన సంస్కారాల అనంతరం వెంటనే స్వాతిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ప్రదీప్‌తో ఉన్న వివాహేతర సంబంధం నేపథ్యంలోనే భర్తను హత్య చేసినట్టు ఒప్పుకుంది. అనంతరం నిందితులు జిల్లా కేంద్రంలోనే ఓ రహస్య ప్రాంతంలో ఉన్నారని  పోలీసులు తెలుసుకుని అరెస్ట్‌ చేశారు. కేసును త్వరితగతిన ఛేదించిన వన్‌టౌన్‌ సీఐని ఎస్పీ, ఏఎస్పీ పద్మనాభరెడ్డి, డీఎస్పీ గంగారాం అభినందించారు. 

హత్యలో పాలుపంచుకుంది వీరే...
సోమ కేశవులును హత్య చేసేందుకు భార్య స్వాతి ప్రియుడు ప్రదీప్‌ను ప్రోత్సహించింది. దుబ్బ ప్రదీప్, కంబం ప్రసాద్, శివకుమార్, చింతపల్లి నగేశ్‌లు హత్యకు ప్లాన్‌ వేశారు. చింతపల్లి నగేశ్‌ రెండోసారి కేశవులును చంపేందుకు ఇంటికి వచ్చే సమయంలో అధికంగా మద్యం తాగడంతో లేవలేని స్థితిలో ఉన్నాడు. నగేశ్‌ను వదిలేసి శివకుమార్, ప్రసాద్, భార్యస్వాతి, ప్రియుడు ప్రదీప్‌లు కలిసి కేశవులును హత్య చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top