ఖమ్మం ఎంపీ ఎవరు? | who will get khammam mp seat? | Sakshi
Sakshi News home page

ఖమ్మం ఎంపీ ఎవరు?

May 16 2014 2:29 AM | Updated on Sep 2 2017 7:23 AM

ఖమ్మం ఎంపీ ఎవరు?

ఖమ్మం ఎంపీ ఎవరు?

ఖమ్మం ఎంపీ సీటు ఎవరికి దక్కనుంది..? నామాకు మరో చాన్స్ వస్తుందా..? తుమ్మల వర్గం ఆయనకు సహకరించిందా..?

సాక్షి, ఖమ్మం: ఖమ్మం ఎంపీ సీటు ఎవరికి దక్కనుంది..? నామాకు మరో చాన్స్ వస్తుందా..? తుమ్మల వర్గం ఆయనకు సహకరించిందా..? సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తొలిసారి చట్టసభల్లో అడుగుపెడతారా? వైఎస్‌ఆర్‌సీపీ ప్రభంజనంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీ కావడం ఖాయమా..? జిల్లా ప్రజలు జోరుగా చర్చించుకుంటున్న ఈ ప్రశ్నలకు శుక్రవారం సమాధానం దొరకనుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం జిల్లా ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

 బీజేపీ పొత్తుతో టీడీపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ బలపరిచిన సీపీఐ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఈ ఎన్నికల్లో బరిలో దిగారు. వారిద్దరూ ఆయా పార్టీల పరంగా ఉద్దండులే. సీపీఎం మద్దతో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీరితో తలపడ్డారు.

 నామా గత ఐదేళ్లలో కావల్సినంత వ్యతిరేకతను కూడబెట్టుకున్నారని, పార్టీలో వర్గపోరుకు ఆజ్యం పోశారని, అవే ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలే అంటున్నారు. అధినేత వద్ద పలుకుబడితో తన వర్గం వారికి పార్టీ, ఇతరత్ర పదవులు ఇప్పించుకోవడంతో దీర్ఘకాలికంగా పార్టీని నమ్ముకుని ఉంటున్నవారు నష్టపోయారని తుమ్మల నాగేశ్వరరావు వర్గం పలుమార్లు విమర్శలు చేసింది.

 కొత్తగూడెం అసెంబ్లీ టికెట్ విషయంలో తుమ్మల ప్రధాన అనుచరుడు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకు టిక్కెట్ ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిమిషంలో రద్దు చేయడం వెనుక నామా హస్తముందనే ఆరోపణలు కూడా ఆయనకు ప్రతికూలంగా పనిచేశాయంటున్నారు. ఈ ఘటన తుమ్మల, నామా వర్గాల మధ్య ఉన్న విభేదాలను తారాస్థాయికి తీసుకెళ్లిందని కూడా చెబుతున్నారు. పార్టీలో నామా మితిమీరిన జోక్యమే ఆయన కొంపముంచుతుందని ఆయన వ్యతిరేక వర్గీయుల వ్యాఖ్య.

 ఓవైపు రిక్త‘హస్తం’..మరోవైపు స్థానికేతరుడు..అనే ఈ రెండు అంశాలే నారాయణను పుట్టిముంచుతాయనే చర్చ సాగుతోంది. ఒకవేళ నారాయణ విజయం సాధిస్తే తమకు కొరకరాని కొయ్యలా మారుతారనే ఉద్దేశంతోనే పొత్తుపెట్టుకున్నప్పటికీ కాంగ్రెస్ నేతలు ఆయనకు సహకరించలేదనే వాదన కూడా ఉంది.

 నామా, నారాయణలపైనున్న వ్యతిరేకతే  వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కలిసివచ్చే అంశమని రాజకీయవిశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అన్నింటికీ మించి వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలు, ప్రజలకు ఆయనపై ఉన్న ప్రేమాభిమానాలు, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలతో నిరంతర సంబంధాలు నెరపడం వంటి అంశాలు పొంగులేటికి అనుకూలంగా మారవచ్చని అంచనా వేస్తున్నారు.

 వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, రాష్ట్ర నాయకురాలు షర్మిల ప్రచారం కూడా శీనన్నకు శ్రీరామ రక్షగా మారుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ అంచనాల్లో ఏది నిజమో..ఏది కాదో నేడు తేలనుంది. ఎడతెగని ఉత్కంఠకు తెరపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement