పార్ట్‌టైం, ఎంటీఎస్‌ ఉద్యోగులెందరు?

Who are the Part Time and MTS Employees? - Sakshi

వివరాలు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశం

12 అంశాలపై వివరాలు కోరుతూ ప్రత్యేక ఫార్మాట్‌ జారీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న పార్ట్‌టైం, మినిమమ్‌ టైంస్కేల్‌ (ఎంటీఎస్‌) ఉద్యోగుల తాజా లెక్కల సేకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శాఖల వారీగా వివరాలను సమగ్రంగా అందజేయాల ని వివిధ విభాగాధిపతులను ఆర్థిక శాఖ ఆదేశించింది. గత నెలలో సీఎస్‌ ఎస్‌కే జోషి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఉద్యోగుల వివరాల సేకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్‌ఎంఆర్‌లు, డైలీ వేజెస్, కంటిజెంట్‌ లేదా కన్సాలిడేటెడ్‌ కింద వివిధ శాఖల్లో చేరిన అనేకమంది ఉద్యోగులు ఏళ్లుగా పార్ట్‌టైం, మినిమమ్‌ టైం స్కేల్‌పై పనిచేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో కొంతమందిని రెగ్యులరైజ్‌ చేసినా, ఇంకా చాలామంది వివిధ శాఖల్లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా అలాగే ఉండిపోయిన వారి వివరాలను ఇవ్వాలని విభాగాధిపతులను ఆదేశించింది.  

4 ప్రధానాంశాలు.. 
1993 నవంబర్‌ 25వ తేదీ నాటికే పదేళ్ల సర్వీసు పూర్తయినా, రెగ్యులరైజ్‌ కాని పార్ట్‌టైం ఉద్యోగుల వివరాలను ఇవ్వాలని కోరింది. ఆ స్థానాల్లో క్లియర్‌ వేకెన్సీలు ఉన్నాయా? పనిచేస్తున్న వారికి తగిన విద్యార్హతలు ఉన్నాయా? ఇతర కారణాలతో అర్హత పొందలేకపోయారా? పాలనాపరమైన జాప్యం జరిగిందా? అన్న 4 ప్రధాన అంశాలతో ఆ వివరాలను ఇవ్వాలని ఆర్థిక శాఖ రూపొందించిన ప్రొఫార్మాను అన్ని శాఖలకు పంపించింది. దాని ప్రకారం వివరాలను ఇవ్వాలని పేర్కొంది. అలాగే అందులో పనిచేస్తున్న ఉద్యోగి పేరు, పుట్టిన తేదీ, పోస్టు పేరు, నియామక తేదీ, ఎన్‌ఎంఆర్‌గా అపాయింట్‌ అయ్యారా? డైలీ వేజెస్‌ కింద అపాయింట్‌ అయ్యారా? కంటింజెంట్‌ కింద లేదా కన్సాలిడేటెడ్‌ కింద నియమితులయ్యారా? ప్రస్తుతం వారికి ఎంత వేతనం వస్తోంది? 1993 నాటికి వారికి ఉన్న సర్వీసు ఎంత? ఆ పోస్టులకు నిర్దేశించిన అర్హతలు, అభ్యర్థికి ఉన్న అర్హతలు, సామాజిక వర్గాల వారీగా వివరాలు తదితర 12 అంశాలపై వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top