డబుల్ ఇళ్ల ఊసెక్కడ..? | where double houses ..? | Sakshi
Sakshi News home page

డబుల్ ఇళ్ల ఊసెక్కడ..?

Apr 20 2016 2:49 AM | Updated on Sep 29 2018 4:44 PM

రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన పథకం డబుల్ బెడ్ రూం పథకం ఇంత వరకు మొదలు కాలేదు.

శంకుస్థాపనకే పరిమితమా!?
కొణిజర్ల : రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన పథకం డబుల్ బెడ్ రూం పథకం ఇంత వరకు మొదలు కాలేదు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చి తీరుతామని గల్లీ నాయకుడి దగ్గర నుంచి మంత్రి వరకు అందరూ హామీలు గుప్పిస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. దీనికి తోడు గతంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగిందని ప్రభుత్వం బిల్లుల చెల్లింపులు నిలిపి వేసింది. అటు పాత బిల్లులు రాక కొత్త ఇళ్లు రాక లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
 
వైరా నియోజకవర్గ పరిధిలో 400 డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేశారు. వీటి నిర్మాణాలను మొదలు పెట్టేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గత ఏడాది అక్టోబర్ 26న తనికెళ్లలో శంకుస్థాపన చేశారు. నాలుగు నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. మండలంలో తనికెళ్ల, పెద్దగోపతి, తీగలబంజర, రాంపురం, విక్రంనగర్ గ్రామాల్లో వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ స్వయంగా లబ్ధిదారులను గుర్తించారు. వారికి ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు అధికారులు సైతం ప్రకటించారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఈ జాబితాకు బ్రేక్ పడింది.

జిల్లా కలెక్టర్, మంత్రి , ఎమ్మెల్యేలు కలసి జాబితాను తయారు చేయాలని కోర్టు ఆదేశించడంతో ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటి వరకు తిరిగి దాని ఊసే ఎవ్వరు ఎత్తటం లేదు. అధికారులు సైతం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
 
ఉన్న ఇళ్లు కూల్చారు..
ఎమ్మెల్యే ప్రతిపాదనతో ఇక తమకు ఇళ్లు ఖాయం అన్న ధీమాతో పలువురు లబ్ధిదారులు తమకున్న కొద్ది పాటి ఇండ్లను కూల్చివేసుకున్నారు. తనికెళ్లలో సుమారు 8 మంది, తీగలబంజరలో రెండు కుటుంబాల వారు తమకున్న ఆధారాలను కూల్చివేసుకుని రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. ప్రస్తుతం కాస్తున్న ఎండలకు ఆ రేకుల షెడ్లలో ఉండలేక అనేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఇటీవల కాలంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పిన నాయకులు స్పష్టత ఇవ్వకపోవడం వల్ల నిరుపేదల తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.  

ఇప్పట్లో ఇళ్ల నిర్మాణం జరిగే పరిస్థితి కనబడటం లేదు. గ్రామంలో ఉమ్మడిగా స్థలం ఉన్నచోట ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అయితే ఇలా మండలంలో ఎక్కడా ప్రభుత్వ స్థలం లేదు. దీంతో సొంతింటి కల నెరవేరుతుందా.. లేదా.. అనే అయోమయంలో లబ్ధిదారులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార్లు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement