జోరుగా జల విద్యుత్‌ | Water power generation in the state | Sakshi
Sakshi News home page

జోరుగా జల విద్యుత్‌

Oct 16 2017 5:48 AM | Updated on Oct 16 2017 5:48 AM

Water power generation in the state

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో జల విద్యుదుత్పత్తి ఊపందుకుంది. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో డ్యాం ఎడమ గట్టు జల విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. రాష్ట్ర విద్యుత్‌ సంస్థల అంచనాలకు మించి ఈ ఏడాది జల విద్యుదుత్పత్తికి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 11 జల విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,400 మిలియన్‌ యూనిట్ల(ఎంయూ) జల విద్యుదుత్పత్తికి అవకాశం ఉందని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు తమ వార్షిక బడ్జెట్‌ నివేదికలో అంచనా వేశాయి. గత ఐదేళ్లలో జరిగిన జల విద్యుత్‌ నుంచి సగటు తీసి ఈ అంచనాకు వచ్చాయి.

అయితే ఆదివారం నాటికి కృష్ణా, గోదావరి బేసిన్‌ల పరిధిలోని జలాశయాల్లో ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం 504.9 టీఎంసీల వరద వచ్చి చేరగా.. వీటితో మొత్తం 1,424 ఎంయూల జల విద్యుదుత్పత్తికి అవకాశం ఉందని రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో) వర్గాలు అంచనా వేశాయి. గత శనివారం నాటికే 725.81 ఎంయూ జల విద్యుదుత్పత్తి జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలోని జలాశయాల్లో ఇంకా 308.1 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. రాష్ట్రంలో 2,351.8 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం గల 11 జల విద్యుత్‌ కేంద్రాలు ఉండగా.. రోజుకు 25–30 మిలియన్‌ యూనిట్ల చొప్పున ఉత్పత్తి కొనసాగుతోంది.

ఇక ప్రైవేటు కొనుగోళ్లు అక్కర్లేదు..
వర్షాభావంతో ఏటా జల విద్యుదుత్పత్తిపై ఆశలు ఆవిరవుతున్నాయి. ఉత్పత్తి లేకపోవడంతో లోటు పూడ్చుకోవడానికి డిస్కంలు ప్రైవేటు కంపెనీల నుంచి విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నాయి. 2014–15తో పోలిస్తే 2015–16లో 10 శాతమే జల విద్యుదుత్పత్తి జరిగినట్లు డిస్కంలు తమ వార్షిక బడ్జెట్‌ నివేదికలో పేర్కొన్నాయి. 2015–16లో సగటు విద్యుత్‌ కొనుగోలు వ్యయం యూనిట్‌ రూ.4.45కు పెరిగిందని, 2014–15తో పోల్చితే ఇది 53 పైసలు అధికమని ఇందులో నివేదించాయి.

ఆశించిన మేరకు జల విద్యుదుత్పత్తి లేకపోవడంతో ప్రైవేటు విద్యుత్‌ కొనుగోళ్ల కోసం డిస్కంలు ఏటా రూ.వందల కోట్ల అదనపు భారాన్ని మోస్తున్నాయి. 2015–16లో కేవలం 284.76 ఎంయూల జల విద్యుదుత్పత్తి జరగ్గా.. 2016–17లో 1,305.80 ఎంయూల ఉత్పత్తి జరిగింది. 2017–18లో ఇప్పటివరకు 725.81 ఎంయూల ఉత్పత్తి జరగ్గా ఏడాది ముగిసే నాటికి 1,500 ఎంయూలకు చేరే అవకాశాలున్నాయి. దీంతో డిస్కంలపై ప్రైవేటు విద్యుత్‌ కొనుగోళ్ల భారం తగ్గనుంది.

జెన్‌కోకు రూ.10 కోట్ల లాభం
జల విద్యుదుత్పత్తి ప్రారంభం కావడంతో తెలంగాణలో విద్యుత్‌ మిగిలిపోతోంది. ఈ నేపథ్యంలో బయటి మార్కెట్లో, పవర్‌ ఎక్సే్ఛంజీలకు విద్యుత్‌ను విక్రయించి లాభాలు ఆర్జిస్తోంది. గత బుధవారం నుంచి ఆదివారం వరకు రోజుకు 3.5 మిలియన్‌ యూనిట్ల చొప్పున విద్యుత్‌ విక్రయిస్తూ రూ.12 కోట్ల వరకు తెలంగాణ జెన్‌కో ఆదాయం ఆర్జించింది. రూ.2 కోట్ల ఉత్పత్తి వ్యయంతో రూ.12 కోట్ల ఆదాయాన్ని గడించింది. థర్మల్‌ విద్యుదుత్పత్తి కోసం యూనిట్‌కు రూ.3.50 నుంచి రూ.3.45 వరకు వ్యయం అవుతుండగా.. జల విద్యుత్‌ విషయంలో మాత్రం యూనిట్‌కు దాదాపు రూపాయి ఖర్చు అవుతోంది.

ఎక్కడెంత ఉత్పత్తి?
ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రియదర్శిని జూరాలలో 162.21 ఎంయూలు, దిగువ జూరాలలో 152.65 ఎంయూలు, శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుదుత్పత్తి కేంద్రంలో 362.51 ఎంయూలు, నాగార్జునసాగర్‌ జల విద్యుదుత్పత్తి కేంద్రంలో 30 ఎంయూల విద్యుదుత్పత్తి జరిగింది. అలాగే చిన్న జల విద్యుత్‌ కేంద్రాలైన సింగూరులో 4.59 ఎంయూలు, నిజాంసాగర్‌లో 3.53 ఎంయూల జల విద్యుదుత్పత్తి జరిగింది. నాగార్జునసాగర్‌ నుంచి ఎడమ గట్టు కాల్వకు, పోచంపాడు రిజర్వాయర్‌ నుంచి కాకతీయ కెనాల్‌కు నీటిని విడుదల చేయాల్సి ఉంది. త్వరలో అక్కడి జల విద్యుత్‌ కేంద్రాల్లో సైతం ఉత్పత్తి ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement