రూ. కోటి ‘చెత్త’పాలు

waste dump rickshaws not use in proper way in vikarabad - Sakshi

నిరుపయోగంగా చెత్త తరలించే రిక్షాలు

స్వచ్ఛభారత్‌ మిషన్‌లో ఒక్కో పంచాయతీకి రెండు అందజేత

నిర్వహణ భారంతో మూలకు..

జిల్లాలో 367 గ్రామ పంచాయతీలు

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌  మిషన్‌లో భాగంగా చెత్త సేకరణకు ఒక్కో పంచాయతీకి రెండు రిక్షాలను అందజేసింది. ఇవి కొన్ని పంచాయతీల్లో మినహాయిస్తే జిల్లాలోని దాదాపు 70శాతం గ్రామాల్లో మూలకు చేరాయి. ఈనేపథ్యంలో రిక్షాల కొనుగోలు కోసం కేటాయించిన రూ. కోట్ల నిధులు ‘చెత్త’ పాలయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్వచ్ఛభారత్‌ పథకం లక్ష్యం మరింత దూరమవుతోంది. రిక్షాల నిర్వహణ భారం కావడంతోనే అవి నిరుపయోగంగా మారాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సాక్షి, వికారాబాద్‌: జిల్లా పరిధిలో మొత్తం 367 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద చెత్త రిక్షాలను నాలుగేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించి డంపింగ్‌ యార్డుల్లో వేయాలని సూచించింది. అయితే, రిక్షాల నిర్వహణ భారం కావడంతో వీటిని దాదాపు 30 శాతం గ్రామపంచాయతీలు మాత్రమే వినియోగిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికగా పంచాయతీకి రెండు చొప్పున కేంద్ర ప్రభుత్వం మొత్తం 734 చెత్త రిక్షాలను నాలుగేళ్ల క్రితం పంపిణీ చేసింది.

ప్రస్తుతం చాలా పంచాయతీల్లో ఇవి నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. పంచాయతీలు రిక్షాల నిర్వహణకు ఒకో కార్మికుడికి నెలకు రూ. 2 వేలకు తక్కువ కాకుండా వేతనం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సూ చించింది. అయితే, పంచాయతీల్లో నిధు ల లేమితో రిక్షాల నిర్వహణ భారంగా మారింది. దీంతో వాటిని ఉపయోగించేందుకు ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని పంచాయతీల్లో నిధుల కొరత కనిపిస్తున్నది. అభివృద్ధి పనుల కోసం 14వ ఆర్థిక సం ఘం నిధులను వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్నది. 2017 జూలై నెలలో రూ.14కోట్ల 50 లక్షలను ప్రభు త్వం పంచాయతీలకు విడుదల చేసింది. గ్రామాల్లో మురుగుకాలువలు, మంచినీటి సరఫరా, సీసీ రోడ్లు, అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులకు ఈ నిధులను వినియోగించారు.

 ఈనేపథ్యంలో డబ్బు ల కొరత ఏర్పడింది. చెత్త తరలించే రిక్షాలను నడిపే కూలీలకు జీతాలివ్వడం, రిక్షాలు మరమ్మతులు తదితరాలు పంచాయతీలు భారంగా పరిణమిస్తున్నాయి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు ప్రత్యేకంగా కొన్ని నెలలుగా నిధులు అందకపోవడం కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు కేంద్ర సర్కార్‌ పంపిణీ చేసిన చెత్త రిక్షాలను వినియోగించడం లేదు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఒక్కో రిక్షాకు రూ. 12 వేల నుంచి రూ. 15 వేల వరకు వెచ్చించింది. ఈలెక్కన రూ. కోటి నిధు లు ‘చెత్త’పాలయ్యాయనే విమర్శలు వినపడుతున్నాయి. కేంద్ర సర్కార్‌ ఉద్దే శం బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉండడంతో ఇబ్బందులు తలె త్తుతున్నాయని చెప్పవచ్చు. పంచా యతీ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు.   

నైపుణ్యమున్న కార్మికులు ఏరీ..?  
స్వచ్ఛభారత్‌ మిషన్‌ కార్యక్రమం కింద పంపిణీ చేసిన రిక్షాలను నడపాలంటే నైపుణ్యమున్న (స్కిల్డ్‌) కార్మికులు అవసరం. వీరు ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించి గ్రామాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్‌ యార్డులకు తరలించాలి. డంపింగ్‌యార్డులు లేనిచోట గ్రామానికి దూరంగా వ్యర్థాలను పారబోయాల్సి ఉంటుంది. దీంతో పాటు రోడ్లను శుభ్రంచేయాలి. గ్రామంలోని వీధుల్లోని చెత్తను సైతం సేకరించాలి. ప్రస్తుతం పంచాయతీల్లో ఉన్న కార్మికులు రిక్షాలను నడపడం లేదు. కొత్తవారిని పెట్టుకుంటే వారికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామ పంచాయతీలు 14వ ఆర్థికసంఘం నిధులపై ఆధారపడ్డాయి. పంచాయతీలలో నిధుల లేమికి తోడు తక్కువ వేతనానికి చెత్త రిక్షాలను తోలడానికి కార్మికులు ముందుకు రాకపోవడం కూడా రిక్షాల నిరుపయోగానికి కారణంగా చెప్పుకోవచ్చు.  

రిక్షాలను వినియోగంలోకి తెస్తాం..
స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద చెత్త తరలించేందుకు కేంద్ర సర్కార్‌ రిక్షాలను అందజేసింది. చాలావరకు రిక్షాలను వినియోగిస్తున్నట్లు మాకు సమాచారం ఉంది. ఎక్కడైనా వీటిని ఉపయోగించకుంటే చర్యలు తీసుకుంటాం. చెత్త తరలించే రిక్షాలను వినియోగంలోకి తీసుకొస్తాం. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతాం.  –మాజిద్, జిల్లా పంచాయతీ అధికారి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top