కాలానికి పత్రం సమర్పయామి..! | Vistarak Which Made Wirth Moduga Leaves Is Disappearing | Sakshi
Sakshi News home page

కాలానికి పత్రం సమర్పయామి..!

Aug 7 2019 12:47 PM | Updated on Sep 22 2019 1:51 PM

Vistarak Which Made Wirth Moduga Leaves Is Disappearing - Sakshi

సాక్షి, రాయపర్తి: కాలానికంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి కంప్యూటర్‌ యుగంలో మానవుడు ప్రకృతి ‘ప్రసాదా’లకు క్రమక్రమంగా దూరమైపోతున్నాడు. భూతల్లి అందించే సహజ వనరులను అందిపుచ్చుకునేందుకు అవకాశం లేక పర్యావరణం సమతుల్య తను దెబ్బతీసే ప్లాస్టిక్‌ భూతాన్ని ఆశ్రయిస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నాడు. అభివృద్ధి పేరుతో బందీగా మారిన మానవుడు కాలగర్భంలో తనకు ఉన్న కళలు, అభిరుచులను ధారపోస్తూ ఉత్తిచేతులతో కాలం వెళ్లదీస్తున్నాడు. ప్రకృతిమాత అందించే విస్తరాకులను వదిలిపెట్టి డిస్పోజబుల్స్‌ కోసం పరుగులు తీస్తున్నాడు. దీంతో పర్యావరణానికి పెనుముప్పుగా మారుతుండగా.. గ్రామాల ప్రజలకు ఉపాధిని దూరం చేస్తోంది.

ఆనాటి రోజులే బాగున్నాయి...
కాలానికనుగుణంగా నేటి స్పీడుయుగంలో మోదుగు చెట్టు ఆకులతో తయారు చేసిన విస్తరాకులను పక్కనబెట్టి రంగురంగుల కృత్రిమ రసాయనాలతో తయారు చేసిన ప్లాస్టిక్‌  ప్లేట్లవైపే అందరూ మొగ్గు చూపుతున్నారు. పెళ్లిళ్లు, పేరంటాలకు ఆకర్షణీయమైన ప్లాస్టిక్‌తో తయారు చేసిన ప్లేట్లను వినియోగిస్తున్నారు. మోదుగుచెట్టు ఆకులతో తయారు చేసిన విస్తరాకులపై వేడివేడి అన్నం, కూరలతో వేడివేడిగా భోజనం చేస్తుంటే ఎంతో బాగుండేదని వృద్ధులు చెబుతుంటారు. 

మోదుగు ఆకు ప్రత్యేకం
ఆయుర్వేదం ప్రకారం ఆకుపచ్చని ఆకులో భోజనం చేయడం వల్ల కళ్లు, మనసుకు ఇంపును ఇవ్వడంతోపాటు జీర్ణశక్తి పెరుగుతుందనేది పూర్వీకుల నమ్మకం. ఆకుపై ఎలాంటి రసాయన మైనపు పూతలు ఉండకపోవడం వల్ల వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చు. సహజసిద్ధంగా దొరికే మోదుగాకుకు ఎలాంటి రసాయనిక మైనపు పూతలు ఉండకపోవడం వల్ల ఆహారంలోకి ఎలాంటి రసాయనిక మార్పులు చేరవు. ఎక్కువ కాలం నిల్వ ఉండే విస్తరాకు మోదుగ. శుభ్రం చేయడానికి వీలుగా ఉంటుంది. అప్పటి రోజుల్లో మోదుగ, మర్రి, రావి, అరటిఆకు, పసుపు ఆకులను విస్తరులుగా చేసి భోజనం చేసేవారు.

తెలంగాణలో విరివిగా దొరికే మోదుగ ఆకులను సేకరించి ఎండబెట్టి పనులు లేని సమయాల్లో ఇంటివద్ద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఆకులు కుట్టేవారు. అలాంటిది ఇప్పుడు  యాంత్రిక జీవనంలోకి రెడీమేడ్‌గా రంగురంగులతో తయారు చేసిన ప్లాస్టిక్‌ విస్తర్లు పల్లెసీమల్లోకి సైతం చేరాయి. వ్యవసాయ పొలాల్లోకి వనభోజనాలకు వెళ్లిన క్రమంలో అప్పుడే తయారు చేసిన మోదుగ ఆకులను విస్తర్లుగా చేసి భోజనం చేసి వచ్చేవారు. కానీ ప్లాస్టిక్‌ ప్లేట్లు, గ్లాసులనే తీసుకెళ్లి వినియోగిస్తున్నారు. ఇక మోదుగు ఆకులను కేవలం దైవపూజలో మాత్రం ఉపయోగిస్తుండడం గమనార్హం.

ప్లాస్టిక్‌ ప్లేట్లలో భోజనంతో అనర్థాలు
ప్లాస్టిక్‌ప్లేట్లలో వేడివేడి మటన్, చికెన్‌ కర్రీలు వేసుకొని భోజనం చేయడం వల్ల అందులో రసాయనాలు కరిగి ప్రతీ వారానికి 5గ్రాముల పాలిథిన్‌ పదార్థం మనిషి శరీరంలోకి చేరుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. భోజనం చేసేప్పటి నుంచి ప్రతీ పనికి ప్లాస్టిక్‌ను వినియోగించడం మూలంగా పాలిథిన్‌ శరీరంలోకి చేరి వివిధ రకాల వ్యాధుల బారిన పడడంతో పాటు కేన్సర్‌కు దారితీస్తుందని చెబుతున్నారు.

ఎండాకాలంలో ఆకులు తీసుకొస్తా..
ఎండాకాలంలో మోదుగ ఆకులను సేకరించి మధ్యాహ్న సమయంలో విస్తరాకులను కుడతాను. ఒక్కో విస్తరాకు కట్టకు రూ.55 చెల్లించి తీసుకెళ్తారు. ఆ డబ్బు కుటుంబ ఖర్చులకు తోడ్పడుతాయి. చిన్నప్పుడే ఆకులను అల్లడం నేర్చుకున్నా. అప్పటి నుంచి ఏటా వరకు ఎండాకాలంలో మోదుగ ఆకులను సేకరించి కుట్టి విక్రయిస్తాను. మోదుగ ఆకు విస్తరిల్లో అన్నం తింటుంటే ఆ రుచే వారు. అయితే, ప్లాస్టిక్‌ ప్లేట్లు రావడంతో మోదుగ ఆకులకు డిమాండ్‌ తగ్గింది.
– బాషబోయిన గౌరమ్మ, తిర్మలాయపల్లి

మోదుగ విస్తర్లను దూరప్రాంతాల్లో విక్రయిస్తా..
ప్రత్యేకంగా ఆటో ఏర్పాటు చేసుకొని మండలంలోని ఆరెగూడెం, కొత్తూరు, వర్ధన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో విస్తరాకులను ఒక్కో కట్టను రూ.55చొప్పున కొనుగోలు చేస్తాను. ఒక్క బెండలో 100 ఆకులు ఉంటాయి. ఇక్కడి నుంచి తీసుకెళ్లి వరంగల్, కాశిబుగ్గ, కొత్తవాడ, శివనగర్, రంగశాయిపేట, హన్మకొండ ప్రాంతాల్లో విక్రయిస్తాను. వీటిని ఎక్కువగా దేవాలయాల్లో పూజా కార్యక్రమాల్లో వినియోగిస్తున్నారు. తద్దినాలకు, పొద్దులు, దేవాలయాల్లో జరిగే పండగలకు మాత్రమే వాడుతున్నారు. పెళ్లిళ్లు, ఇతర కార్యాలయాల్లో అందరూ ప్లాస్టిక్‌ విస్తరాకులే వాడుతుండడంతో గిరాకీ అంతంత మాత్రంగా ఉంటోంది.
– బరిగెల ఎల్లయ్య, తిర్మలాయపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement