బంగారు తెలంగాణకు ‘విజన్‌ 2024’ 

'Vision 2024' for Golden Telangana

ప్రణాళిక సిద్ధం చేస్తున్న ప్రభుత్వం 

డిసెంబర్‌ 31న తుది డాక్యుమెంట్‌ 

సాక్షి, హైదరాబాద్‌: బంగారు తెలంగాణ లక్ష్య సాధనకు ప్రభుత్వం కొత్త ప్రణాళికలు రచిస్తోంది. ప్రజల అవసరాలు, ప్రస్తుత పథకాలను సద్వినియోగం చేసుకునే దిశగా కార్యాచరణకు నడుం బిగిస్తోంది. విజన్‌–2024 పేరుతో రాబో యే ఏడేళ్లకు దూరదృష్టితో డాక్యుమెంట్‌ సిద్ధం చేస్తోంది. సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(సీజీజీ) సహకారంతో రాష్ట్ర ప్రణాళిక, ఆర్థిక శాఖలు ఈ ప్రణాళిక రూపొందిస్తున్నాయి. దీనికి అవసరమైన సమాచారాన్ని సీజీజీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని అన్ని శాఖలకు ఇప్పటికే సర్క్యులర్‌ జారీ చేశాయి. నవంబర్‌ నెలాఖరులోగా విజన్‌ 2024 ముసాయిదా తయారు చేసి.. అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ రంగాల భాగస్వాములతో సంప్రదింపులు జరపాలని భావిస్తోంది. వారి సూచనలకు అనుగుణంగా మార్పులు చేసి డిసెంబర్‌ 31న తుది డాక్యుమెంట్‌ ప్రచురించాలని యోచిస్తోంది. అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రస్తుత పరిస్థితిని నివేదించడంతోపాటు ఏడేళ్లలో సాధించాల్సిన లక్ష్యాలు, అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికను డాక్యుమెంట్‌లో పొందుపరుస్తారు.  

10 కేటగిరీలుగా ప్రభుత్వ శాఖలు.. 
విజన్‌ డాక్యుమెంట్‌ తయారీకి వీలుగా ప్రభుత్వ శాఖలు, విభాగాలను 10 కేటగిరీలుగా ప్రభు త్వం వర్గీకరించింది. 10 కేటగిరీలుగా బంగారు తెలంగాణ లక్ష్యాలను నిర్దేశిస్తారు. 2024 నాటికి రాష్ట్రం ఎలా ఉండాలి.. ఆ దిశగా ప్రభుత్వం చేపట్టాల్సిన భవిష్యత్‌ కార్యాచరణను విజన్‌ డాక్యుమెంట్‌ కళ్లకు కట్టిస్తుందని అధికారులు వెల్లడించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు ఇందులో ప్రాధాన్యమిస్తారు. ఉదాహరణకు రాష్ట్రంలో ప్రస్తుతం పాల ఉత్పత్తి ఎంత ఉంది, ప్రస్తుతమున్న జనాభాకు సరిపడేంత స్థాయిలో పాల సరఫరా ఉందా, 2014 నాటికి జనాభా ఎంత మేర పెరుగుతుంది, అప్పటి అంచనాలకు ఎంత మేరకు పాల ఉత్పత్తి సామర్థ్యం పెరగాలి, అందుకు పశు సంవర్థక శాఖ ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి, ఇలా అంచెల వారీగా లక్ష్యాలను అందుకునేలా విజన్‌లో ప్రస్తావించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top