
హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
యాదవుల హక్కులను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు సోమేష్‌యాదవ్ అన్నారు...
- యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు
- మేకల రాములు యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు సోమేష్‌యాదవ్
కామారెడ్డి రూరల్ : యాదవుల హక్కులను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు సోమేష్‌యాదవ్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గాంధారి మండలం మాతు సంగెంలో యాదవ సంఘం బిల్డింగ్ ప్రారంభోత్సవానికి షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా మండలానికి ఒక యాదవ సంఘం భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
గతంలో ప్రతి గ్రామంలో గొర్రెలు, మేకలను మేపుకోవడానికి 5 నుంచి 10 ఎకరాల భూమిని కేటాయించేవారని, దీన్ని ఎత్తివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జీఓ 559, 1016 ప్రకారం ప్రతి గ్రామానికి 5 నుంచి 10 ఎకరాల భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో యాదవ సంఘం భవనాన్ని నిర్మించుకోవాలని, ఇందుకోసం ఎమ్మెల్యే, ఎంపీ నిధులను తీసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారం యాదవులు ఐక్యంగా ఉండాలన్నారు. గొర్రెల, మేకల కాపరులు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, యాదవులను బీసీ డి నుండి బీసీ ఎ లోకి మార్చాలని, గొర్రెల, మేకలకు ప్రభుత్వమే బీమా చెల్లించాలని, మిల్క్ డైరీ చైర్మన్ పదవులను యాదవులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కౌన్సిలర్ అర్కల ప్రభాకర్‌యాదవ్, జిల్లా అధ్యక్షుడు రాములు యాదవ్, కృష్ణాయాదవ్, వెంకట్‌యాదవ్, మల్లేష్‌యాదవ్, సుధాకర్‌యాదవ్, లద్దూరి లక్ష్మీపతియాదవ్ తదితరులు ఉన్నారు.