ప్రభుత్వాలు సొంతంగా పనిచేస్తే పిటిషన్ల అవసరం ఉండదు

Supreme Court Directs Centre and Delhi Govt To Implement Directions Of Air Quality Management Commission - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వాలు సొంతంగా పనిచేస్తే న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేయాల్సిన అవసరం ఎవరికీ ఉండదని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. దేశ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌), ఢిల్లీలో వాయు కాలుష్యం నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ విషయంలో  ‘ఎన్‌సీఆర్, పరిసర ప్రాంతాల్లో ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌’ కమిషన్‌ జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయాలని పేర్కొంది. రాజధానిలో గాలి నాణ్యతను పెంచేలా ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ప్రత్యేక న్యాయస్థానం వరుసగా రెండోరోజు శుక్రవారం కూడా విచారణ జరిపింది.

విద్యార్థుల ఆరోగ్యాన్ని, భద్రతను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీలో పాఠశాలలను మూసివేయాలని ఆదేశించినందుకు ఓ వర్గం మీడియా, కొందరు వ్యక్తులు తమను(న్యాయమూర్తులు) విలన్‌గా చిత్రీకరిస్తున్నారని ఆక్షేపించింది. ఢిల్లీలో వాయు కాలుష్యం కేసును మూసివేయబోమని స్పష్టం చేసింది. కాలుష్యం కట్టడికి ప్రభుత్వాలు చేపట్టే చర్యలను పర్యవేక్షిస్తూనే ఉంటామని తేల్చిచెప్పింది. కోవిడ్‌–19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు గాను ఆసుపత్రులను సిద్ధం చేయడానికి వీలుగా నిర్మాణాలను పునఃప్రారంభించేందుకు ఢిల్లీ ప్రభుత్వానికి ధర్మాసనం అనుమతి మంజూరు చేసింది. ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఐదుగురు సభ్యులతో ఒక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసినట్లు తెలియజేసింది. తాము సూచించిన చర్యల అమలు తీరును పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాలను సిద్ధం చేసినట్లు పేర్కొంది.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top