ఎరువు.. బరువు | Villages in drought | Sakshi
Sakshi News home page

ఎరువు.. బరువు

Aug 11 2015 1:24 AM | Updated on Jun 4 2019 5:04 PM

ఎరువు.. బరువు - Sakshi

ఎరువు.. బరువు

కరువు దెబ్బకు పల్లెలు కళతప్పాయి...

చిన్నబోయిన బోనం
- సంబురానికి దూరంగా పల్లెలు
- కాలం కలిసిరాకరైతు దిగాలు
- పెరిగిన అప్పులు.. చుట్టుముట్టిన కరువు
- వృథాగా ముందస్తుగా కొన్న ఎరువులు
- విధిలేక తిరిగి విక్రయిస్తున్న రైతులు
- తక్కువ ధరకే అమ్ముకుంటున్న దుస్థితి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:
కరువు దెబ్బకు పల్లెలు కళతప్పాయి. ఈ సమయంలో ఉత్సాహంతో బోనమెత్తాల్సిన వ్యవసాయ కుటుంబాలు.. చేతిలో చిల్లిగవ్వ లేక బిత్తరపోయి చూస్తున్నాయి. వరుణుడి కరుణలేక.. కాలం కలిసిరాక.. కరువు ఉరుముతుండటంతో రైతన్న సంబురాలకు దూరమవుతున్నాడు. ఖరీఫ్ మీద ఆశలు సన్నగిల్లిపోతుండటంతో తెచ్చిన అప్పు ముప్పుగా మారుతోంది.. ఫలితంగా అన్నదాతలు ఆత్మరక్షణలో పడ్డారు. ఖరీఫ్ కోసం ముందస్తుగా కొని దాచుకున్న ఎరువుల భారం దించుకునే పనిలో పడ్డారు.

పనికి రాని ఈ ఎరువుల బరువును దించుకునేందుకు రైతులు ఇప్పుడు వాటిని అడ్డికి పావుశేరు చొప్పున అమ్ముకుంటున్నారు. వడ్డీ కిందనైనా యూరియా, డీఏపీ బస్తాలను తీసుకోవాలని షావుకారుల కాళ్లావేళ్లా పడుతున్నారు. రూ. 860కి కొనుగోలు చేసిన పొటాష్‌ను రూ. 450, రూ. 310కి కొన్న యూరియాను రూ. 250 నుంచి 280కే అమ్ముకుంటున్నారు.
 
అన్నీ ముందే సిద్ధం చేసుకున్నా..

జూన్ మాసం రెండో వారం మొదటి పాదంలో రైతులు ఏరువాక సాగుతారు. మే చివరి నాటికి వ్యవసాయ పని ముట్లు సిద్ధం చేసుకుంటారు. వ్యవసాయ క్యాలెండర్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జూన్ మొదటి వారంలో రైతులకు సబ్సిడీ ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచుతుంది. ప్రతి ఏడాది రైతులు ఎరువుల కోసం దుకాణాల వద్ద పడిగాపులు కాచేవాళ్లు. ఈ ఏడాది  మంత్రి హరీశ్‌రావు చొరవ చూపి సహకార సంఘాలు, మహిళా సంఘాలు, ఆథరైజ్డ్ ఫెర్టిలైజర్ దుకాణాల్లో సకాలంలో సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచా రు. ఈ ఏడాది మొత్తం 37,276 మెట్రిక్ టన్నుల యూ రియా, 3560 మెట్రిక్ టన్నుల డీఏపీ, 10520 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 1250 మెట్రిక్ టన్నుల ఎంఓపీ ఎరువులను 4.10 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులు కొనుగోలు చేసి భద్రపరుచుకున్నారు.
 
అడ్డికి పావుశేరు లెక్కన అమ్మకం..
మే మాసం చివరి వారంలో జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. వ్యవసాయదారులకు సాగుపై ఆశలు చిగురించాయి. దొరికిన చోటల్లా అప్పు చేసి ఎరువులు కొనుగోలు చేశారు. 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతూ 3 బస్తాల యూరియా, మూడు బస్తాల డీఏపీ, రెండు బస్తాల పొటాష్, పాస్పేట్  కొనుగోలు చేసి భవిష్యత్తు కోసం భద్రపరుచుకున్నారు. ప్రతి రైతు ఎరువుల కోసం రూ. 10 నుంచి 15 వేలు ఖర్చు చేశాడు. పం డిన ధాన్యం షావుకారికే ఇస్తాననే షరతుతో రైతులు రూ.3 నుంచి రూ.5 వడ్డీతో అప్పు చేసి ఎరువులు కొనుగోలు చేశారు. జూన్ మాసం రెండవ వారం చివరలో ఒకటి, రెండు రోజుల పాటు  కురిసిన వర్షాలతో రైతులు విత్తనాలు గుప్పించారు.  

వ్యవసాయ శాఖ అధికారిక రికార్డుల ప్రకారం 2.73 లక్షల హెక్టార్లలో  సాగు చేశారు. కానీ ఇప్పటి వరకు తిరిగి వర్షాలు పడకపోవడంతో  మొలకెత్తిన  పంట మొలకలు వాడిపోయాయి.  తుకాలు నారు దశలోనే ఎండిపోయాయి.  కాలం అవుతుందేమోననే ఆలోచనతో ముందస్తు జాగ్రత్తగా కొనుగోలు చేసి దాచిపెట్టిన ఎరువులు గడ్డకట్టిపోవడం, రబీ సీజన్ పై ఆశలు సన్నగిల్లిపోవడంతో రైతులు అడ్డికి పావుశేరు చొప్పున ఎరువులను అమ్ముకుంటున్నారు. వాటిని కూడా కొనే దిక్కు లేకపోవడంతో షావుకారి కాళ్లావేళ్లా పడి వడ్డీ కింద నైనా ఎరువులు తీసుకొమ్మని ప్రాధేయపడుతున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కసారిగా ఎరువులు ఇస్తామని రైతులు వస్తుండటంతో షావుకారులు కూడా వాటిని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement